తనకంటే 12 ఏండ్లు పెద్దదైన మహిళను పెళ్లి చేసుకొని, ఆ తర్వాత రకరకాలు ఇబ్బందులు ఎదుర్కొన్న భారత క్రికెటర్ శిఖర్ ధావన్.. నేటి యువతకు అనుభవ పాఠాలు చెబుతున్నాడు. పెళ్లి అనే పరీక్షలో తాను గెలవలేకపోయానని చెబుతూనే.. ఆ కొత్త ప్రపంచంలో ఎలాంటి ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయన్నది ముందే ఊహించలేకపోయానని కూడా చెప్పాడు. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి రాసే పరీక్ష అని, రిజల్ట్ ఏ ఒక్కరి చేతుల్లో ఉండదన్నాడు. తన భార్య ఆయేషా తప్పు చేసిందని అనట్లేదు.. అలాగని తాను తప్పు చేశానని కూడా ఒప్పుకోవట్లేదని ఓ ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ నోరు విప్పాడు.
ఈసారి జాగ్రత్తగా ఉంటా..
ఆయేషాతో ప్రేమలో పడిన తొలినాళ్లలో ప్రతి విషయం మధురంగానే అనిపించేదని చెప్పాడు. ఆ తర్వాత కళ్లకు అలుముకున్న ప్రేమ అనే తెర తొలిగిపోగానే అన్నీ ఇబ్బందిగానే అనిపించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తన విడాకుల కేసు ఇంకా పెండింగ్లోనే ఉందని తెలిపాడు. ఒకవేళ భవిష్యత్తులో తాను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆచితూచి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అంతేగాక అమ్మాయి సెలక్షన్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటానని అన్నాడు.
ఈ తరం కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే..
రిలేషన్‌లో ఉంటే కోపాలు, బాధలు, నవ్వులు, బ్రేకప్స్ ఇలా అన్ని మనల్ని పలకరిస్తాయి. వీటన్నింటినీ అనుభవించాల్సి వస్తుంది. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి పెళ్లి మాత్రం చేసుకోకండి. కొన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉండి, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచించండి. ఈ వ్యవహారం కూడా ఓ క్రికెట్ మ్యాచ్ లాంటిదే. ఇందులో సక్సెస్ అవ్వడానికి కొందరికి నాలుగైదు మ్యాచుల ఆడాల్సి ఉంటుంది. మరికొందరు ఒక్క మ్యాచ్‌తోనే సత్తా చాటుతారు. ఇంకొందరికి ఇంకా చాలా సమయమే పట్టొచ్చు. చివరగా పెళ్లికి ముందు కాస్త అనుభవం మాత్రం చాలా ముఖ్యం” అని తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు ధావన్.
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ కిక్‌బాక్సర్ అయేషా ముఖర్జీని 2012లో ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు ధావన్. ఆయేషా.. ధావన్ కంటే 12 ఏళ్లు పెద్దది. అప్పటికే ఆమెకు పెళ్లయి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధావన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరికి 2014లో జొరావర్ ధావన్ జన్మించాడు. దాదాపు ఎనిమిదేళ్లు కలిసి ఉన్న వీరిద్దరు 2021 సెప్టెంబర్‌లో విడిపోయారు.