కరోనా కంటే.. మోదీపై అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు..
తరుచూ భారత్‌పై దాయాది దేశం పాక్ పాలకులే కాకుండా అక్కడి క్రికెటర్లకు కూడా విమర్శలు చేయడం అలవాటైపోయింది. ఓ వైపు ప్రపంచం అంతా కరోనాతో కల్లోలంలో ఉంటే ఆ దేశ ఆటగాళ్లు తరుచూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ.. తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా షాహిద్ అఫ్రిది ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేశాడు. మోదీ మనసులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలకు భారత క్రికెటర్లు కూడా ఘాటు సమాధానం ఇస్తున్నారు.
ఎంపీ గంబీర్ అఫ్రిదీ వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ‘కశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఏడు లక్షల సైన్యాన్ని మోహరించిందని ఓ 16 ఏళ్లు వృద్ధుడు విషయం కక్కుతున్నాడు. భారత్ సొంతమైన కశ్మీర్ కోసం 70 ఏళ్లుగా భిక్షాటన చేస్తూనే ఉన్నారు. ఎవరు ఏం చేసినా కశ్మీర్ ఎప్పటికీ భారతతీయుల సొంతమే’ అని వ్యాఖ్యానించాడు. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంటే.. మీరు మాత్రం ఇలా ఉన్నారంటూ శిఖర్ ధావన్ స్పందించాడు. వీరితో పాటు సురేష్ రైనా, హర్బజన్ సింగ్ కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. దీంతో పాక్ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలకు భారత ఆటగాళ్లు గట్టిగా కౌంటర్లు ఇవ్వడంతో నెటిజన్లు కూడా వారికి తోడుగా నిలబడుతున్నారు.