'షిండే-ఫడ్నవిస్ సర్కారు మరో 6 నెలల్లో కూలిపోతుంది' - MicTv.in - Telugu News
mictv telugu

‘షిండే-ఫడ్నవిస్ సర్కారు మరో 6 నెలల్లో కూలిపోతుంది’

July 4, 2022

బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఎంతోకాలం అధికారంలో ఉండరని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఆరు నెలల్లో షిండే ప్రభుత్వం పడిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని చెప్పారు. పార్టీ నేతలతో ముంబైలో ఆదివారం సాయంత్రం సమావేశమైన శరద్ పవార్.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన షిండే – బీజేపీ కూటమి సర్కారు ఎన్నో రోజులు అధికారంలో ఉండబోదన్నారు. మధ్యంతర ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు.

2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ, ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి మహా వికాస్ అఘాడి కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ, ఈ కూటమి ఎంతో కాలం నిలువలేదు. ఇప్పుడు బీజేపీతో కలిసి షిండే ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం కూడా రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని పవార్ అంటున్నారు.

ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని పవార్ చెప్పారు. ఒకసారి మంత్రి వర్గాన్ని ప్రకటించి శాఖలు కేటాయిస్తే అప్పుడు వారి అసలు రంగు బయటపడుతుందని, ఇది చివరికి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది పవార్ అన్నారు. బీజేపీతో ప్రయోగం విఫలం చెందిన తర్వాత శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత పార్టీ గూటికి చేరుతారని వ్యాఖ్యానించారు. మరో ఆరు మాసాల్లో ఇదంతా జరుగుతుందని.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో గడపాలని సూచించారు.