చిన్నారి సజీవదహనం కేసు.. షైన్ ఆస్పత్రి ఎండీ అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నారి సజీవదహనం కేసు.. షైన్ ఆస్పత్రి ఎండీ అరెస్ట్ 

October 25, 2019

Shine Children’s Hospital’s MD arrested following the fiasco

ఎల్బీనగర్‌ సమీపంలోని షైన్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో చిన్నారి సజీవ దహనం ఎంతోమందిని కృంగదీసింది. ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఆస్పత్రి ఎండీ సునీల్‌ కుమార్‌, వైద్యుడు హరికృష్ణతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు. షైన్‌ ఆస్పత్రిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు నెలల బాలుడు మృతిచెందగా.. మరో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విచారించగా.. ఆస్పత్రి ఐసీయూలోని రిఫ్రిజిరేటర్‌ పేలి మంటలు వ్యాపించినట్లు తేలింది. 

షైన్‌ ఆస్పత్రికి అగ్నిమాపక శాఖ అనుమతులు లేనట్లు గుర్తించారు. కేసుకు సంబంధించి శుక్రవారం సునీల్‌ను రిమాండ్‌లోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే షైన్ ఆస్పత్రిలో అగ్రిప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇదివరకు కూడా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో ఉన్న ఆస్పత్రులపై దృష్టి సారించారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని 350 ఆస్పత్రులకు నోటీసులు కూడా జారీచేశారు.