Shining Rajasthan - Pushkar Mela in grand style
mictv telugu

మెరిసిపోతున్న రాజస్థాన్- ఘనంగా పుష్కర్ మేళా

November 3, 2022

భిన్న సంస్కృతుల కలయిక భారతదేశం. ఒక్కో రాష్ట్రానిది ఒక్కో కల్చర్. దేని ప్రత్యేకత దానిదే. దేని అందం దానిదే కూడా. వీటిల్లో రాజస్థాన్ కు ఒక ప్రత్యేకత ఉంది. సాంప్రదాయమైన ఆతిధ్యం, రాజసమైన వారసత్వం, కొంత ట్రైబల్ అన్నీ కలగలిపిన సౌందర్యం దీనిది. ఇండియాలో ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్ లలో ఇది ఒకటి.రాజస్థాన్ లో ప్రజలు సంస్కృతి, సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. భారతీయ సంస్కృతి, ఆహారం అనగానే గుర్తుకువచ్చే వాటిల్లో రాజస్థాన్ కూడా ఉంటుంది.

మామూలుగానే రాజస్థాన్ చాలా అందంగా ఉంటుంది. ఏడాది మొత్తంలో ఎప్పుడు వెళ్ళినా బోలెడు ప్రదేశాలు తిరిగి రావొచ్చు. కానీ నవంబర్ లో అది కూడా దీపావళి తర్వాత కార్తీక మాసంలో రాజస్థాన్ మరింత వెలిగిపోతుంటుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచీ కూడా టూరిస్టులు ఈ టైమ్ లో ఇక్కడకు వస్తారు. ఎందుకో తెలుసా…ఏడాదికి ఒక్కసారి నిర్వహించే పుష్కర్ మేళా చూడ్డానికి. దేశంలోనే అతి పెద్ద పశువుల సంతగా పేరుపొందిన ఈ పుష్కర్ మేళాను సాధారణంగా ఐదు రోజుల పాటూ ఘనంగా నిర్వహిస్తారు.

రాజస్థాన్‌లో ఘనంగా నిర్వహించే పుష్కర్ ఫెయిర్ ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని అజ్మేర్ జిల్లాలో ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే పుష్కర్ (Pushkar Fair 2022) ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. కార్తీక మాసంలో ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు రాజస్థాన్ సంస్కృతి సంప్రదాయాలను టూరిస్టులకు పరిచయం చేస్తుంది. ఈ పుష్కర్ మేళాలో ప్రధానంగా చెప్పుకునేది పశువేల సంత గురించే. ఈ ఐదు రోజుల ఉత్సవాల్లో ఒంటెలు, గుర్రాలు, గాడిదలు, బర్రెలు, ఆవుల వంటి వాటిని అమ్మకానికి పెడతారు. దీంతో దేశం నలుమూలల నుంచి వచ్చి మరీ ఇక్కడ వాటిని కొనుగోలు చేస్తారు. అయితే, ఈసారి పశువుల్లో లంపీ చర్మ రోగం రావడంతో పశువుల సంతను ఏర్పాటు చేయడంలేదు.

ఈ ఏడాది 8రోజులు ఉత్సవాలు….

మామూలుగా ఐదు రోజుల మాత్రమే ఉండే పుష్కర్ మేళాను ఈసారి ఎనిమిది రోజులు నిర్వహిస్తున్నామని రాజస్థాన్ టూరిజం శాఖ తెలిపింది. నవంబర్ 1న ప్రారంభమైన మేళా 8న ముగుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, ఏఏ రోజుల్లో ఏమేమి నిర్వహిస్తారు అన్న వివరాలను టూరిజం శాఖ ముందుగానే వెల్లడించింది.

కనువిందు చేయనున్న ఈవెంట్లు…

పుష్కర్ ఫెయిర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆసక్తిగొలిపే పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. పురుషులు, మహిళల మధ్య టగ్ ఆఫ్ వార్, డ్యాన్స్, మట్కా ఫోడ్, పొడవైన మీసాల పోటీలు సందడి చేయనున్నాయి. అలాగే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, కైట్ ఫెస్టివల్, సాండ్ ఆర్ట్ ఫెస్టివల్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా బోలెడు కార్యక్రమాలతో మేళా హడావుడిగా సాగుతోంది. ఈ పోటీల్లో టూరిస్టులు సైతం పాల్గొనవచ్చు.

పుష్కర్ మేళా పేరు వెనుక కథ….

అజ్మైర్ లో ఉన్న పుష్కర్ పట్టణంలో ఈ మేళాను ప్రతీయేటా నిర్వహిస్తారు. ఇక్కడ పుష్కర్ అనే సరస్సు కూడా ఉంది. ఈ పట్టణానికి ఈ పేరు రావడానికి, పుష్కర్ సరస్సు వెనుక ఓ పెద్ద కథే చెబుతారు ఇక్కడి ప్రజలు. దానికి బోలెంత విశిష్టత ఉందని భక్తుల విశ్వాసం. అతి పురాతన పట్టణాల్లో పుష్కర్ ఒకటి. ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మదేవుడే కొలువై ఉన్నాడని ప్రతీతి. ఇక్కడ పుష్కర్ అనే అందమైన సరస్సు ఉంది. అది ఒకానొక సమయంలో బ్రహ్మకమలం కిందపడటంతో ఏర్పడిన సరస్సుగా భక్తులు విశ్వసిస్తారు. అక్కడే బ్రహ్మదేవుడి ఆలయం కూడా ఉంది. ఈ సరస్సు చుట్టూ వందల గుళ్లు ఉండటం మరో విశేషం. హిందూ భక్తులకు ఇదో పుణ్యక్షేత్రం.

విదేశీ టూరిస్టులు…

సహజంగానే రాజస్థాన్ ఎప్పుడూ టూరిస్టులతో హడావుడిగా ఉంటుంది. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏటా రాజస్థాన్‌కు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడ ఉండే కోటలు, ప్యాలెస్‌లు అన్నీ స్పెషల్ ఎట్రాక్షన్ లే. అలాగే పుష్కర్ మేళాకి కూడా జనం విపరీతంగా వస్తారు. ఫెయిర్ జరిగినన్నాళ్ళు ఇక్కడ మంచి వ్యాపారం కూడా జరుగుతుంది. హోటళ్ళు అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. ఈ సమయంలో వెళితేనే అసలైన రాజస్థాన్ కల్చర్‌ను చూడొచ్చు. అందుకే విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా పుష్కర్ మేళాను చూడ్డానికి వస్తుంటారు.

జైపూర్‌ నుంచి పుష్కర్ కు వెళ్ళొచ్చు. అక్కడి నుండి 140 కి.మీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలనుకునేవారు మొదట రాజస్థాన్‌లోని అజ్మేర్‌కు వెళ్లాలి. అక్కడి నుండి పుష్కర్‌కు చేరుకోవచ్చు. ఒకవేళ ఢిల్లీ నుండి వెళ్లాలనుకుంటే రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వేసిన బస్సుల్లో నేరుగా వెళ్ళొచ్చు. ఇక రైలులో వెళ్లాలనుకుంటే అజ్మేర్‌ దగ్గరి రైల్వేస్టేషన్. అక్కడి నుండి 30 నిమిషాల్లో పుష్కర్‌కు చేరుకోవచ్చు.