షిర్డీలో ముగిసిన వివాదం.. ఈసారి అక్కడ మొదలైంది.. - MicTv.in - Telugu News
mictv telugu

షిర్డీలో ముగిసిన వివాదం.. ఈసారి అక్కడ మొదలైంది..

January 22, 2020

Shirdi saibaba controversy agitation started in Pathri Maharashtra 

అన్ని కులమతాలు ఆరాధించే సాయిబాబా కొలువైన షిర్డీపై వివాదానికి తెరపడిందని భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వివాదం వెనుక రాజకీయం ఉండడంతో అక్కడ మొదలైన గొడవ ఈసారి పత్రికి పాకింది. షిర్డీ కోసం తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సబబా అంటూ స్థానికులు రోడ్డెక్కారు. 

సాయిబాబా జన్మించినట్లు భావిస్తున్న పర్బణి జిల్లాలోని పత్రిని అభివృద్ధి చేయడానికి రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. పత్రిని అభివృద్ధి చేస్తే తమ ప్రాంతానికి ప్రాధాన్యం ఉండదని, భక్తులు తగ్గి వ్యాపారాలు పడిపోతాయని షిర్డీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బంద్ కూడా పాటించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పత్రి సాయినాథుని జన్మస్థలం అని ప్రభుత్వం చెప్పదని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. షిర్డీ ట్రస్టు కూడా ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పత్రిలో నిరసనలు మొదలయ్యాయి. పత్రిలోని సాయి ఆలయ ట్రస్టు సభ్యులు, స్థానికులు దీనిపై మండిపడుతున్నారు. సాయి పత్రిలో జన్మించడానికి చెప్పే ఆధారాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం షిర్డీని, తమ ప్రాంతాన్నీ సమానంగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెక్కుతామని, బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు.