స్టోరీ, స్క్రీన్ ప్లే,పోలీస్ డైరెక్షన్ సూపర్..మరి క్లయిమాక్స్ ఏంటో..? - MicTv.in - Telugu News
mictv telugu

స్టోరీ, స్క్రీన్ ప్లే,పోలీస్ డైరెక్షన్ సూపర్..మరి క్లయిమాక్స్ ఏంటో..?

June 22, 2017

అబ్బబ్బ..రియల్ క్రైమ్ థ్రిల్లర్.. మలుపుల మీద మలుపులు తిప్పుతున్నారు. కొత్త కొత్త అనుమానాల్ని తెప్పిస్తున్నారు.ఆహా..సినిమా డైరెక్టర్ కూడా ఓ క్రైమ్ స్టోరీ ని ఇన్ని మలుపులు తిప్పలేడేమో..పాత్రధారులు , సూత్రధారులు, శీలనధారులూ..ఎహె సూపర్. డబుల్ గేమ్ లు , డబుల్ వెర్షన్లు, లోకేషన్ ఛేంజింగ్ లు…కేసు ఛేజింగ్ లు..ఓరి నాయనో ఎవ్రీ థింగ్..ఎవ్రీ సీన్..అచ్చం సినిమానే తలపించేస్తున్నాయి. రెండు ఆత్మహత్యలు..రోజులు గడిచే కొద్దీ పెరుగుతోన్న డౌట్లు..ఈ రియల్ క్రైమ్ థిల్లర్ లో విలన్లు ఉన్నారా…?ఉంటే వాళ్లెవరు..?ఈ స్టోరీకి డైరెక్టర్ ఎవరు…? నిజనిజాలు ఎప్పటికి తేలేను…?

బ్యుటీషియన్ శిరీష మృతి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి.రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. నిన్నటిదాకా ఆడియో టేపులు కలకలం రేపగా లేటెస్ట్ గా సంఘటనరోజు శిరీష ఆమె భర్తకు పంపిన లోకేషన్ సరికొత్త అనుమానాల్ని తెప్పిస్తోంది. కుకునూరుపల్లి స్టేషన్‌లోనే మందు పార్టీ జరిగిందని తెలుసు. పోలీసులూ అదే చెప్పారు. కానీ శిరీష ఆమె భర్తకు పంపిన లొకేషన్.. పోలీసులు బయటకు చెప్పిన లొకేషన్ వేర్వేరుగా ఉన్నాయి. శిరీష పంపిన చివరి లొకేషన్ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌కి 4కి.మీల దూరంలో ఉన్న ఫామ్ హౌస్‌ను గూగుల్ లొకేషన్ చూపిస్తోంది. ఈ లొకేషన్‌ను పోలీసులు ఎందుకు దాచిపెట్టారు. అసలు పోలీసులు చెప్పేవన్నీ అబద్దాలేనా.? శిరీష తన స్నేహితులుగా చెప్పుకొన్న నవీన్‌, నందులతో మాట్లాడిన ఆడియో సంభాషణలను పట్టించుకోవడం లేదు. శిరీష మాట్లాడిన మాటలంటూ టీవీ చానళ్లలో వస్తున్నాయని.. అవి నిజమా? కాదా? అన్నది తమకు అనవసరమంటున్నారు పోలీసులు. ఇవి కేసు విచారణలో పనికిరావా..?

ఇక శిరీష చనిపోయి వారందాటినా పోలీసులు, ఆమె బంధువులకు ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి. ఆమెపై కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడని ప్రకటించిన బంజారాహిల్స్‌ పోలీసులు.. ఆమె దుస్తులు, శరీరభాగాల నమూనాలను లైంగిక దాడి నిర్ధరణ పరీక్షలకు పంపారు. జూన్‌ 12న కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఇంకా ఏదో జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే జైల్లో ఉన్న శ్రవణ్‌, రాజీవ్‌ల నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఐదురోజుల కస్టడీకి అప్పగించాలంటూ కోర్టుని పోలీసులు అభ్యర్థించారు. న్యాయస్థానం నుంచి అనుమతి రాగానే శిరీష, రాజీవ్‌ల మధ్య తేజస్విని కారణంగా వచ్చిన గొడవలు, మద్యం మత్తులో జరిగిన పరిణామాలపై వారిని విచారిస్తారు.

మరోవైపు శ్రవణ్‌ ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడిన కాల్స్‌ సంఖ్యను పోలీసులు గుర్తించారు. అందులో ఏమన్నాడంటే‘అన్నా.. శిరీష లీడింగ్‌ బ్యుటీషియన్‌. ఆమెకు ఫేవర్‌ చేస్తే మనకు భవిష్యత్‌లో బాగా పనికొస్తుంది. శిరీషను తీసుకొస్తా.. మీరు చూసి డిసైడ్‌ చేయండి’ అంటూ ఎస్సైతో చెప్పినట్లు ఆధారాలు సేకరించారు. అటు రాజీవ్‌తో ‘శిరీషను వదిలించుకుందాం.. నీకు ఇష్టమేనా? ఇందుకు ఎస్సైకి కొంత ఫేవర్‌ చేయాలి’ అని శ్రవణ్‌ అన్నట్లు తెలుస్తోంది. తేజస్వినిని పెళ్లిచేసుకోవాలనుకున్న రాజీవ్‌.. శ్రవణ్‌ ఆడిన డబుల్‌గేమ్‌కు ఒప్పుకోవడంతో రాత్రివేళ హడావుడిగా వారిద్దరినీ కుకునూరుపల్లికి తీసుకెళ్లాడని పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే కేసులో ప్రధాన నిందితుడిగా అతనిపై అభియోగాలు నమోదు చేశారు.
మొత్తానికి శిరీష , ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసుల్లో రోజురోజుకి అనుమానాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మినిట్ టు మినిట్ లోకేషన్లు తెలుసుకునే టెక్నాలజీ అందుబాటులో ఉన్నా చిక్కుముడులు వీడటం లేదు. పుటకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఈ రియల్ క్రైమ్ స్టోరీ కి క్లయిమాక్స్ ఏంటో చూడాలి.