మహిళలు అంతరిక్ష యాత్రలు చేస్తున్న కాలమిది. ఆడవాళ్లు ఎందులోనూ తీసిపోరు. నేలపైనే నింగిలోనూ దూసుకుపోతున్నారు. పుణెకు చెందిన ప్రముఖ స్కైడైవర్ శీతల్ రాణె మహాజన్ 9 గజాల చీరకట్టుకుని అద్భుత విన్యాసం చేసింది. చీరతో 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డుకెక్కింది.
థాయ్ల్యాండ్లోని పట్టాయాలో ఈ విన్యాసం చేసింది శీతల్. 9 గజాల పొడవు ఉంటే మహారాష్ట్ర సంప్రదాయ ‘నౌవారి’ చీర అంటే తనకెంతో ఇష్టమని, దాన్ని కట్టుకునే ఈ ఫీట్ చేశానని ఆమె చెప్పింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్న నేపథ్యంలో ఈ విన్యాసం చేశానన్నారు. ‘ఇంత పెద్ద చీర.. పైగా పారాచూట్, హెల్మెట్, గాగుల్స్, షూస్, ఫోన్లు, వైర్లు.. ధరించడం మరింత కష్టమైంది. అయితే వాతావరణం అనుకూలంగా ఉండడంతో రెండుసార్లు డైవ్ చేశాను..
పారాచూట్ ల్యాండ్ అయ్యేప్పుడు కాస్త కంట్రోల్ తప్పాను.. కానీ నాకేం గాయాలు కాలేదు’ అని శీతల్ తెలిపింది. స్కైడైవింగ్లో ఆమె ప్రతిభకు మెచ్చి ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందించింది. ఆమె పేరుతో దేశంలో 18 స్కైడైవింగ్ రికార్డులు, 6 ప్రపంచ 6 రికార్డులు ఉన్నాయి. ఉత్తర ధ్రువంలో మైనస్ 37డిగ్రీల ఉష్ణోగ్రతలో 2,400 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన ప్రపంచరికార్డు ఆమెది. శీతల్ తన పెళ్లిని కూడా హాట్ఎయిర్ బెలూన్లో 750 అడుగుల ఎత్తులో చేసుకుంది.