బీజేపీకి మరో షాక్.. కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీకి మరో షాక్.. కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ రాజీనామా

November 11, 2019

మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది ఆసక్తిగా మారింది. గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానించినప్పటికీ.. సంఖ్యాబలం లేని కారణాన్ని చూపుతూ విముఖత వ్యక్తం చేసింది. ఆదిత్య థాక్రేను సీఎం చేయాలని ఆలోచిస్తున్న శివసేనకు ఎన్సీపీ మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీతో ఉన్న మిత్రబంధాన్ని తెంచుకోవాలని ఎన్సీపీ షరతులు పెట్టడంతో ఆ దిశగా రాజకీయం మారుతోంది. 

దీంట్లో భాగంగా కేంద్ర మంత్రిగా ఉన్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్ర బంధాన్ని బీజేపీ పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం అరవింద్ సావంత్ భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌టైన్ మెంట్స్ మంత్రిగా ఉన్నారు. ఆయన రాజీనామా ప్రకటనతో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న బీజేపీకి శివసేన 50 – 50 ఫార్ములాతో మెలిక పెట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పుకుంటున్నట్టు నిర్ణయించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.