శివసేన తిరుగుబాటు నేతకే సీఎం పీఠం..ఈ విజయం వారిదే
మహారాష్ట్రలో గతవారం రోజులుగా ఉత్కంఠ రేపిన రాజకీయ పరిణామాలకు గురువారంతో పులీస్టాప్ పడింది. ఒక్క రోజులోనే మహారాష్ట్రలో రాజకీయం తలకిందులు అయ్యింది. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన 24 గంటల్లోనే రాజకీయ పండితులు, ప్రజల అంచనాలను తలకిందులు చేస్తూ, శివసేన తిరుగుబాటు వర్గం–బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముందుగా గురువారం మధ్యాహ్నాం వరకు మహారాష్ట్రకు నెక్ట్స్ సీఎం ఎవరు? అనే దానిపై తెగ చర్చలు జరిగాయి. దాదాపు అందరు బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ సీఎం అవుతారని అంచనాలు వేసుకున్నారు. కానీ, ప్రజల, రాజకీయ నిపుణుల అంచనాలను తారుమారు చేస్తూ, శివసేన తిరుగుబాటు నేత ఎక్‌నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా పీఠం దక్కించుకున్నారు.
మహారాష్ట్ర నూతన (20వ) ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే(58), ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(51) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాత్రి 7.30 గంటల తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏక్‌నాథ్ షిండే తొలుత దివంగత శివసేన అగ్రనేతలు బాల్ ఠాక్రే, ఆందన్ డిఘేకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.
"రాష్ట్ర అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తా. రాష్ట్రంలో అన్ని వర్గాలను నాతోపాటు కలుపుకొని ముందుకెళ్తా. దేవేంద్ర ఫడ్నవీస్ నా పట్ల ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వవను. మహారాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నా. సీఎంగా నా నియామకం బాల్ ఠాక్రే సిద్ధాంతానికి, నా గురువు ‘ధర్మవీర్’ఆనంద్ డిఘే బోధనలకు లభించిన విజయం" అని ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ట్విటర్ వేదికగా వెల్లడించారు.