ఉద్ధవ్‌కు భారీ షాక్.. రెబెల్స్ కొత్త పార్టీ ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్ధవ్‌కు భారీ షాక్.. రెబెల్స్ కొత్త పార్టీ ప్రకటన

June 25, 2022


శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు రెబెల్ ఎమ్మెల్యేలు గట్టి షాక్ ఇచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి తాము ‘శివసేన బాలా సాహెబ్’ అనే కొత్త పార్టీ తరపున పనిచేయనున్నట్టు రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కె సర్కార్ వెల్లడించారు. అంతేకాక, తాము ఏ పార్టీతోనూ కలవబోమని తేల్చి చెప్పారు. తాజా పరిణామంతో రెబెల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ గూటికి వచ్చే అవకాశాలు మూసుకుపోయినట్టే. అయితే రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన పనిపై ఉద్ధవ్ తన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అందులో రెబెల్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా బాల్ థాకరే పేరు వాడరాదని తీర్మానం చేశారు. పార్టీ గురించిన ఏ నిర్ణయమైనా తీసుకునేలా ఉద్ధవ్ థాకరేకు అధికారం కట్టబెట్టారు. అనంతరం ఉద్ధవ్ మాట్లాడుతూ.. రెబెల్ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. బాల్ థాకరే పేరు వాడకుండా, మీ తండ్రుల పేర్లతో ఎన్నికల్లో గెలవాలని ఛాలెంజ్ చేశారు.