నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ ఆరోపణల్లో చిక్కుకున్నారు. రాజకీయాలేమోగానీ కుటుంబపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కుమారులు లేరని చెప్పడంతో మరి నేనెవరిని అంటూ ఓ యువకుడు వెలుగులోకి వచ్చాడు. తన పేరు మేకపాటి శివచరణ్ రెడ్డి అని చెప్తూ బహిరంగ లేఖ విడుదల చేశాడు. దీంతో పాటు తన చిన్ననాటి ఫోటోలు రిలీజ్ చేశాడు.
తల్లిని, తనను 18 ఏళ్లపాటు రహస్యంగా ఉంచావని, ఇప్పటికైనా నీ కుమారుడిగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశాడు. తన తల్లి తరవాత పరిచయమైన ఆమెని సమాజానికి పరిచయం చేశావని, తానే మేకపాటి వారసుడినంటూ లేఖలో పేర్కొన్నాడు. ‘కేవలం ఫీజులు చెల్లించి చదివిస్తే బాధ్యత తీరిపోతుందా? నన్ను కనమని నేను అడగలేదు. 14 ఏళ్ల వయసులో మీరు మమ్మల్ని విడిచి పెట్టిన తర్వాత మీ మనసులో నా స్థానం ఏంటో అర్ధం చేసుకున్నాను. మీరు నా తల్లితో 18 ఏళ్లు కలిసి జీవించారు. తర్వాత మీ జీవితంలో మేము లేము. ఎన్నో మధుర క్షణాలను కోల్పోయాను. మీ సంపద, మీ రాజకీయ వారసత్వం వెనుక నేను లేను. మీరు చేయగలిగింది ఏమైనా ఉందంటే అది నన్ను కొడుకుగా గుర్తించడమే’నని రాసిన లేఖ తీవ్ర చర్చకు దారి తీసింది. కాగా, ఇప్పటివరకు ఈ లేఖపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అధికారికంగా స్పందించలేదు. ఈ వివాదానికి ఆయన ఎలాంటి ముగింపు పలుకుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.