సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ముంబయిలో నిర్వహించిన ఆడిషన్స్ లో ఆమె ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పోటీలో నిలిచింది. 3 రోజుల పాటు జరిగిన ఆడిషన్స్ లో ఇండియా మొత్తం మీద టాప్-31 ఫైనలిస్టులను ఎంపిక చేశారు. ఈ కాంపిటిషన్లో శివానీ తమిళనాడు తరఫున నామినేట్ అవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. తెలుగుమ్మాయి తమిళనాడు నుండి ఈ పోటీలో పాల్గొనడం ఏమిటనే సందేహం చేస్తున్నారు.
దీనికి సమాధానంగా ‘శేఖర్’ మూవీ ట్రైలర్ లాంచ్ వేదికపై తన వివరణ ఇచ్చింది శివానీ. తాను తమిళనాడులో పుట్టానని, పెరిగింది మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తరపున అప్లయ్ చేశానని చెప్పింది. అయితే, అందాల పోటీల నిర్వాహకులు మాత్రం తనను తమిళనాడు కేటగిరీ కింద పోటీకి పరిగణనలోకి తీసుకున్నారని వివరించింది. ఏ రాష్ట్రం తరపున సెలెక్ట్ చేయాలనేది జడ్జెస్ చేతిలో ఉంటుందని చెప్పింది. అయితే తెలుగమ్మాయిగా సెలక్ట్ కాకపోవడం కాస్త బాధగా ఉందని, ఏదేమైనా తాను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వకారణంగా భావిస్తానని పేర్కొంది.