రెండు దేశాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు.. షోయబ్ - MicTv.in - Telugu News
mictv telugu

రెండు దేశాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు.. షోయబ్

August 19, 2019

Shoaib Akhtar

కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఆర్టికల్ 370ని పాక్‌లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి ఆటగాళ్లు, అధికారులు రెండు దేశాల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. యుద్ధం అనే పదం వాడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ మాత్రం వాళ్లందరికీ భిన్నంగా కాస్త పరిణతి కలిగిన మాటలు చెప్పాడు. 

కశ్మీర్‌లో ఉద్రికత్త నెలకొన్న నేపథ్యంలో ఎవరూ ‘విద్వేషం’ వ్యాప్తి చేయొద్దని కోరుతూ.. తన యూట్యూబ్‌ ఛానల్లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ‘మన పరిస్థితి బాగాలేదని నేను అంగీకరిస్తాను. మీరు మీ దేశాన్ని ప్రేమిస్తారు. మేం మా దేశాన్ని ప్రేమిస్తాం. ఈ రెండూ నేను ఒప్పుకుంటాను. రెండు దేశాల మధ్య మరింత విధ్వేషం రెచ్చగొట్టడానికి మనం కారణం కాకూడదు. ఉద్రికత్త, ఆందోళనను మరింత పెంచే వ్యాఖ్యలు చేయకండి. అలాంటి చర్యల జోలికి వెళ్లొద్దు. మీరు మీ వైఖరి, విశ్వాసాలకే కట్టుబడండి. కానీ పరిస్థితిని మరింత దిగజారకుండా చూడాలని కోరుతున్నా’ అని అక్తర్‌ వీడియోలో పేర్కొన్నాడు.