అక్షర యోధుడు షోయబుల్లా ఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

అక్షర యోధుడు షోయబుల్లా ఖాన్

August 22, 2017

అక్షరాన్ని అగ్నికణంలా మార్చి రజాకార్ల రాక్షసత్వంపై ఓ కలం వీరుడు కదమ్ తాల్ చేశాడు..నిప్పుకణికల్లాంటి అక్షరాలతో నిజాం వెన్నులో వణకుపుట్టించాడు..ఆయనే షహీద్ షోయబుల్లా ఖాన్. హైదరాబాద్ విముక్తి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన తెలంగాణ నిప్పు రవ్వ షోయబుల్లా ఖాన్ . 1948 అగస్ట్  22న కాసీం రజ్వీ గుండాలు షోయబుల్లాఖాన్ ను అంతం చేశాయి. ఈ రోజు ఖాన్ వర్ధంతి సందర్భంగా ఆయన వీరోచిత పోరాటాన్ని తెలుసుకుని స్ఫూర్తి పొందుదాం.

నిరంకుశత్వానిదే నిర్బంధమయితే అక్షరమే ఆయుధమవుతుంది. కత్తుల కోలాటంపై కలం కన్నెర్ర చేస్తుంది. ఆ కలానికి షహీద్ షోయబుల్లాఖాన్ ఖలేజా తోడయితే పెత్తనాన్ని ధిక్కరించే స్వేఛ్చాగీతం పురుడు పోసుకుంటుంది. పీడనను ఎదురించే పిడికిళ్లు బిగుసుకుంటాయి.ఒక్క సిరాచుక్కతో లక్షమెదళ్లలో తిరుగుబాటు బీజాలు మొలకెత్తుతాయి.

అక్షరంగా మారడానికి 1919 అక్టోబర్ 2న అగ్నికణం కళ్లు తెరిచింది. ఖమ్మం జిల్లా సుబ్లేడ్ లో షోయబుల్లా ఖాన్ పుట్టాడు..తల్లి షయిబుల్లా, తండ్రి హీబీబుల్లా. రైల్వేలో కానిస్టేబుల్ కావడంతో హబీబుల్లాకు హైదరాబాద్ బదిలీ అయింది. ఉస్మానియా యూనివర్సిటీలో షోయబుల్లా ఖాన్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.

తెలంగాణ అగ్నిగోళంలా మండుతోన్న కాలమది. దొరల దోపిడీ సాగదంటూ సామాన్యుడు సమరం సాగిస్తున్న సమయమది. రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదురిస్తూ హైదరాబాద్ లో రగల్ జెండా రెపరెపలాడుతున్న రోజులవి. సరిగ్గా అప్పుడే గుండెల నిండా ప్రజాస్వామ్య కాంక్షతో దుర్మార్గ పాలనను ఎదురించే చైతన్యంతో క్యాంపస్ నుంచి షోయబుల్లా ఖాన్ బయటకొచ్చాడు. తాను చదివిన చదువుకు కోరుకుంటే  ఏ ఉద్యోగమైనా కాళ్ల దగ్గరకే వచ్చేది. నిర్బంధాన్ని ప్రశ్నించే ధైర్యం నరనరాన పాకుతుంటే.. తలదించుకుని ఉద్యోగం చేయాలా? అందుకే అక్షరాన్ని ఆయుధంగా మార్చి నియంతృత్వంపైనే సమరం చేయాలనుకున్నాడు ఖాన్. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించాడు..

ఉర్దూ అధికార భాషగా ఉన్న ఆ కాలంలో పత్రికలన్నీ నిజాంకు అనుకూలంగా ఉండేవి,  ఏవో ఒకటి రెండు పత్రికలు తప్ప. షోయబుల్లాఖాన్ అలాంటి పత్రికనే ఎంచుకున్నాడు. తేచ్ అక్బార్ లో చేరాడు. రజాకార్లు, భూస్వాముల ఆగడాలపై ప్రతీరోజూ అక్షరాలను ఎక్కుపెట్టాడు. ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజలకు అందించాడు..అందుకే తేజ్ అక్బార్ ను నిజాం ప్రభుత్వం నిషేధించింది. కణకణమండుతోన్న నిప్పుకణిల్లాంటి షోయబుల్లాఖాన్ అక్షరాలకు అవకాశం ఇవ్వడానికి రయ్యత్ ముందుకొచ్చింది. అక్కడ షోయబుల్లాఖాన్ ఆవేశానికి అక్షరాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ కలంపోటు నిజాంను ఉక్కిరిబిక్కిరిచేసింది. దీంతో దాన్ని బంద్ చేయించాడు..

నిజాం దౌర్జన్యాన్ని ఎదురించడానికి సొంత పత్రిక ఉంటేనే మంచిదనుకున్నాడు షోయబుల్లాఖాన్. మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో భార్య, తల్లి నగలను అమ్మి ఇమ్రోజ్ ను స్థాపించాడు. 1947 నవంబర్ 17న మొదటి సంచిక వెలువడింది. అందులో షోయబుల్లా పెన్ను గన్నయింది. బుల్లెట్లలా అక్షరాలు నిజాం గుండెల్లోకి దూసుకెళ్లాయి. ఆయన రాతలు రజాకార్లకు వాతలు పెట్టాయి. వెన్నులో వణుకుపుట్టడంతో కాసీం రజ్వీ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అయినా షోయబుల్లాఖాన్ అక్షరాలు తడబడలేదు.మరిన్ని అన్యాయాలను ఎండగట్టాడు. ఎర్రకోటపై నిజాం జెండా ఎగరవేస్తానన్న రజ్వీ ప్రకటనతో షోయబుల్లాఖాన్ రక్తం కుతకుతలాడింది. రజ్వీ దురహంకారాన్ని ఇమ్రోజ్ లో తీవ్రంగా వ్యతిరేకించాడు. నిజాంను వ్యతిరేకిస్తూ వార్తలు రాస్తే చేతులు నరికేస్తామని, పత్రికను సర్వనాశనం చేస్తామని రజ్వీ బహిరంగంగానే బెదిరించాడు..అయినా షోయబుల్లా ఖాన్ తగ్గలేదు. సత్యాన్వేషణలో ప్రాణాలు పోవడం గర్వించాలన్న విషయమన్నాడు. అప్పుడే అతణ్ని తుదముట్టించే యత్నాలు మొదలయ్యాయి.

1948 అగష్టు 22.. కాచిగూడలోని ఇమ్రోజ్ ఆఫీసులో పని పూర్తి చేసుకుని అర్ధరాత్రి ఇంటికి బయలుదేరాడు షోయబుల్లా. బావమరిది ఇస్మాయిల్ ఖాన్ కూడా ఉన్నాడు పక్కనే. ఇంతలో.. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు..ఒక్కసారిగా పదిమంది దుండగులు షోయబుల్లాఖాన్ పై విరుచుకుపడ్డారు. తన రాతలతో రజ్వీ గుండెకు చెమటలు పట్టించిన ఆ ధీరుని  చేతులను నరికేశారు. భయమంటే తెలియని ఆ గుండెపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. అడ్డుకోబోయిన ఇస్మాయిల్ నూ వదల్లేదు. అయితే తుపాకీ చప్పుళ్లు విని స్థానికులు బయటకురావడంతో దుండగులు పారిపోయారు. నెత్తిటి మడుగులో ఉన్న షోయబుల్లాను ఉస్మానియాకు తరలించారు. రెండు గంటల తరువాత స్పృహలోకి వచ్చిన షోయబుల్లా..ఇమ్రోజను కొనసాగించమన్నాడు. ధర్మానిదే గెలుపని కన్నుమూశాడు..

హైదరాబాద్.. భారత్ లో విలీనం కావాలన్నది షోయబుల్లాఖాన్ కల.ః దాని కోసం నడిరోడ్డు మీదనే ప్రాణాలను బలిపెట్టాడు. కానీ అలాంటి త్యాగమూర్తికి తగినంత గౌరవం దక్కలేదు. తెలంగాణ నిప్పురవ్వ కు ట్యాంక్ బండ్ పై గజం జాగా దక్కలేదు. తర్వాతి తరాలు తెలుసుకోవడానికి షోయబుల్లాఖాన్ చరిత్ర పాఠ్యాంశాల్లో లేదు. పోరుగడ్డ విముక్తి కోసం ఆఖరిశ్వాస వరకు పోరాడిన షోయబుల్లాఖాన్ చరిత్ర చీకట్లో కలిసింది..

దేహంతో మొదలయ్యే జీవన ప్రస్థానం దేహంతోనే అంతమవుతుంది. కాని ఓ వీరుని రక్తపు చుక్క వేల వీరులకు జన్మనిస్తుంది. ప్రాణం తీయవచ్చు. కాని ఆశయాన్ని చంపలేరు. అందుకే అక్షరమే ఆయుధంగా నిరంకుశత్వంపై పోరాడిన కలం వీరుడు షోయబుల్లాఖాన్ వారసత్వాన్ని తెలంగాణ జర్నలిస్టులు కొనసాగిస్తున్నారు..