దుల్కర్‌కు షాక్.. అతని సినిమాలపై నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

దుల్కర్‌కు షాక్.. అతని సినిమాలపై నిషేధం

March 16, 2022

jjhjk,

మలయాళ స్టార్ హీరో, మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్‌కు కేరళ రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు గట్టి షాకినిచ్చాయి. దుల్కర్ సల్మాన్‌ సినిమాలపై నిషేధం విధించాయి. భవిష్యత్తులో అతడు నటించబోయే చిత్రాలతోపాటు ఇదివరకు నటింటిన సినిమాలన్నింటీని బాయ్‌కాట్ చేయాలని ద ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్‌ఈయూకే) నిర్ణయించింది. దీంతో దుల్కర్ సల్మాన్‌ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. ఏం జరిగింది?. ఎందుకు దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం విధించారు? అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఈ సందర్భంగా థియేటర్ల ఓనర్స్ అందుకు ప్రధాన కారణం ఇదేనంటూ ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘సెల్యూట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫా‌మ్‌ అయిన సోనీలీవ్‌లో విడుదల చేయాలని దుల్కర్ నిర్ణయించుకున్నాడు. ‘సెల్యూట్’ను థియేటర్లలో రిలీజ్ చేయకుండా, నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌‌లో విడుదల చేస్తుండటంతో అతడి సినిమాల్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ఎఫ్‌ఈయూకే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై దుల్కర్ ఇప్పటి వరకు స్పందించ లేదు. ‘సెల్యూట్’ సినిమా ఈ ఏడాది జనవరి14నే విడుదల కావాలి. కానీ భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. దుల్కర్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వే ఫారర్ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ మూవీలో అతడు పోలీస్ పాత్రలో అలరించనున్నాడు. డయానా పెంటీ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి రోషన్ అండ్రూస్ దర్శకత్వం వహించాడు.

మరోపక్క దుల్కర్ సల్మాన్‌ ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కొన్ని రోజుల క్రితమే ‘కురుప్’ మూవీతో థియేటర్లలో సందడి చేశాడు. బాక్సాఫీస్ హిట్లతో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్‌పై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించడం ప్రస్తుతం కలకలం రేపుతుంది.