స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, ఐటెం పాటలు, ఫారెన్ స్పాట్స్, రాకింగ్ మ్యూజిక్ ఇవేమీ లేకుండానే బాక్సాఫీసు వద్ద ఓ రేంజ్లో దుమ్మురేపుతోంది బలగం సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ స్క్రీన్ పైన విడుదలైన తెలంగాణ కథకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకు 25 రోజుల్లోనే భారీ కలెక్షన్స్ వచ్చి పడుతున్నాయి. కనీ వినీ ఎరుగని విధంగా వరల్డ్ వైడ్ వసూళ్లను రాబడుతోంది బలగం చిత్రం.
కంటెంట్ ఉంటే హిట్ పక్కా…
పక్కా తెలంగాణ పల్లెటూరి నేటివిటీతో తెరకెక్కిన సినిమా బలగం. బుల్లితెరపైన కామెడీ యాక్టర్‌గా తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న వేణు బలగం సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధార్ రెడ్డి లాంటి వారు ఈ మూవీలో నటించారు. తమ సహజ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. కంటెంట్ ఉంటే హిట్ పక్కా అని మరోసారి ఈ సినిమా రుజువు చేసింది. చిన్న సినిమానే అయినా విడుదలైన రెండు మూడు రోజుల్లోనే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు బడ్జెట్ కు మించి వసూళ్లను రాబడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.24.29 కోట్ల వసూలు..
దిల్ రాజు నిర్మాణంలో మార్చి 3న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది బలగం. అప్పటి వరకు సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించారు. బిగ్ స్క్రీన్ మీద తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్భుతంగా ప్రదర్శించి వేణు ప్రేక్షకుల హృదయాలను కదిలించాడు. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు. లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ బలగం మూవీని ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణాల్లో ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది. ఈ 25 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.24.29 కోట్ల గ్రాస్‌ను దాటి..రూ.11.14 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఒక్క తెలంగాణలోనే ఈ సినిమా రూ.16.75 కోట్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు సుమారు. రూ.10 కోట్లకి పైగానే సినిమాకు లాభం దక్కినట్లు తెలుస్తోంది.
ఫుల్ ఖుషీలో మేకర్స్…
బలగం మూవీ వసూళ్లను చూసి మూవీ మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏపీలోనూ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటంతో మరిన్ని స్క్రీన్లలో తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు దిల్ రాజు. ఈ మధ్యనే బలగం ఓటీటీలోనూ విడుదలైంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
కథేంటంటే….
బలగం చక్కటి కుటుంబ కథా చిత్రం. కుటుంబ సభ్యుల మద్య వచ్చే అపోహలు, అపార్థాలను పరిష్కరించే కథలతో ఈ మధ్య తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ బలగం కథ మొత్తం ఇంటి పెద్దాయన చావు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో వేణు ప్రతి పాత్రను ఎంతో అద్భుతంగా నారేట్ చేశాడు. సున్నితమైన పాయింట్స్ నుంచి కామెడీ, సెంటిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌ను నటుల నుంచి రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా మొత్తం తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను చూపించాడు.
చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి, ఆప్తులకు దూరం కావడం సరికాదని, కలిసి ఉంటేనే సంతోషం అని చెప్పే కథే బలగం.