తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల కరెంట్ బిల్లులు ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. నెలకి 2,3 వందలొచ్చే కరెంట్ బిల్లు.. ఈసారి రూ.4 వేలు వచ్చేసరికి వినియోగదారులు ఒక్కసారిగా అధికారులపై విరుచుపడుతున్నారు. ఏంటీ బిల్లు..? ఎందుకిలా వస్తోందంటూ గుండెలు బాదుకుంటున్నారు. బిల్లు చూసి షాకైన వినియోగదారులు కరెంట్ ఆఫీస్‌కి పరుగులు తీస్తున్నారు. లిమిటెడ్ యూనిట్స్ విద్యుత్ వాడినా, బిల్ మాత్రం వేలల్లో ఎందుకు వస్తుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో కూలీ పనిచేసుకునే ఓ వ్యక్తి ఇంటికి నెలకి రూ. 400 కరెంట్ బిల్లు వచ్చేది. ఈ సారి 4 వందల బిల్లుతో పాటు డెవలప్మెంట్ ఛార్జీలతో కలిపి 3 వేల బిల్లు వచ్చింది. కూలీ పని చేసుకునే వాళ్లకు సైతం వేలల్లో కరెంట్ బిల్లులు రావడంతో కన్నీరుమున్నీరు అయ్యాడు. రెక్కాడితే కానీ, డొక్కాడని తమకు అధిక మొత్తంలో బిల్లులు వేయడమేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క కరెంట్ బిల్లును చూసి ఆవేదనకు గురైన ప్రజలు.. విధిలేని పరిస్థితుల్లో అప్పుచేయాల్సి వస్తోందంటున్నారు. అధికారులు మాత్రం అయిదారు వాయిదాలు తీసుకున్నా ఫర్వాలేదు. కానీ బిల్ మాత్రం కచ్చితంగా కట్టి తీరాల్సిందేనని తెలుపుతున్నారు.