భర్త లేని సమయంలో రూంలోకి దూరి వివాహిత కణితపై తుపాకీ పెట్టి హైదరాబాద్ మారేడ్‌పల్లి మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసు దర్యాప్తుకు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్‌రెడ్డి నేతృత్వంలో స్పెషల్ టీం ఏర్పాటు చేయగా.. అత్యాచారం ఘటనా స్థలం నుంచి ఇబ్రహీంపట్నం యాక్సిడెంట్ వరకు కీలక ఆధారాలు సేకరించింది.
మహిళపై రివాల్వర్ గురిపెట్టి కిడ్నాప్‌కు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీతో పాటుగా.. నాగేశ్వర్రావు అధికారిక పిస్టల్‌ను స్వాధీనం చేసుకుంది. బాధితురాలిపై అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు.. బాధితురాలి భర్త కొట్టిన కర్ర, అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించినట్టు పోలీసులు తెలిపారు. అత్యాచారం ఘటన తర్వాత.. ఎలాంటి ఆధారాలు ఉండకూడదని నాగేశ్వరరావు తన బట్టలు స్వయంగా ఉతుక్కున్నాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మారేడ్‌పల్లి పీఎస్‌కు వెళ్లి విధులు నిర్వహించాడని వెల్లడైంది.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న వెంటనే.. అతని రివాల్వర్ ను మారేడ్‌పల్లి పీఎస్‌లోనే ఉంచి బెంగళూరుకు పరారయ్యాడు. అతడు పరారైన సంగతి తెలుసుకొన్న పోలీసులు.. కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీలో అతని నివాసంలో సోదాలు నిర్వహించారు. అతని ఇంట్లో అత్యాచార సమయంలో వాడిన ప్యాంటు, షర్టు, డ్రాయర్, బనియన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కొవిడ్, లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన అనంతరం హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.