యువతలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎవరేం చేస్తారులే అన్న నిర్లక్ష్యం అధికమైంది. క్షణికావేషంలో ఏం చేస్తున్నామన్న విచక్షణను కోల్పోయి మరీ నేరస్థులుగా మారుతున్నారు యువకులు. నిండు జీవితాలను నాశనం చేస్తూ కన్నవారి కడుపుకోతకు కారణమవుతున్నారు . ప్రేమకోసం, ప్రియురాలి ,డబ్బు కోసం నిండుప్రాణాలను బలిగొనే ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతోందన్న భయాందోళన నెలకొంటోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఇలాంటి ఓ భయానకమైన ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఘజియాబాద్‌లోని సాహిబాబాద్‌కు చెందిన మనీష్ కుమార్ తన లవర్‌తో కలిసి బైక్ డ్రైవ్ చేస్తూ హద్దులు మీరి మరీ ప్రవర్తించాడు. బండి మీదే అసభ్యకరమైన రీతిలో కూర్చుకుని రొమాన్స్ చేశారు. రొడ్డుమీద వెళ్లే వారు చూస్తారన్న సెన్స్ కూడా లేకుండా ముద్దులు పెట్టుకున్నారు. ఈ దృష్యాలను చూసి చాలా మంది మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. కానీ బైక్ పైన అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ జంటను ఆపి పబ్లిక్ ప్లేస్‌లో ఇలా చేయడం సరికాదని మందలించాడు. దీంతో రెచ్చిపోయిన ప్రేమికుడు తన స్నేహితులకు కాల్ చేసి మరీ పిలిపించి సదరు యువకుడిపై దాడి చేశాడు. ఇటుకలు, కర్రలతో బలంగా కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. కాపాడేందుకు వచ్చిన బంటీ అనే వ్యక్తిపైన దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మృతి చెందిన యువకుడు విరాట్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. అతని వయసు 27 ఏళ్లు.
ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అసభ్యకరమైన పోజులో కూర్చుని బైక్‌పై వెళుతున్న ఓ జంట వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో లవర్ ఎలాంటి నేరానికి పాల్పడలేదు. అయినప్పటికీ రూల్స్ అతిక్రమించి రోడ్‌పై న్యూసెన్స్ చేయడంతో పోలీసులు అతడిని మందలించారు.