తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై షాకింగ్ సర్వేలు
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి. 2018 తరహాలోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. ఇప్పటికే దూకుడు పెంచారు. ఇరు పార్టీల జాతీయ అగ్ర నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. అధికార పార్టీ లొసుగులని ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా రాజకీయం చేస్తున్నారు. మరోవైపు విపక్షాలకు ధీటుగా అధికార పార్టీ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్ లో జోష్ నింపుతోంది. అదే సమయంలో సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటుంది. సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉంది.
ఇక దేశంలోనే టాప్ వ్యూహకర్తగా చెప్పుకునే ప్రశాంత్ కిషోర్.. ఈసారి టీఆర్ఎస్ కోసం వర్క్ చేస్తున్నారు. ఐప్యాక్ టీమ్‌లు తెలంగాణలో పర్యటిస్తూ ప్రజల నాడి తెలుసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కేసీఆర్ కు నివేదికలు ఇస్తున్నాయి. పీకే టీమ్ నివేదికల ఆధారంగా పార్టీ నేతలను అలర్ట్ చేస్తున్నారు గులాబీ బాస్. ఆశ్చర్యకరంగా కేసీఆర్ కు అందుతున్న నివేదికలన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలలోని ప్రజలు తమకు అభయమిచ్చేది ‘హస్తం’ గుర్తు పార్టీనేనని చెబుతున్నట్లు తెలిసింది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో కమలం పార్టీకి కాస్త పట్టు ఉండడంతో.. కొన్ని ప్రాంతాలు మినహాయించి దాదాపు అక్కడ కూడా చేయి గుర్తుకు మొగ్గు చూపుతున్నారు జనం. గులాబీ పార్టీ మాత్రం.. హస్తాన్ని వదిలేసి తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీగా కమలదళాన్ని టార్గెట్ చేసింది. అంతుపట్టని విషయం కూడా ఇదే.
కేసీఆర్ బీజేపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు?
కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయడం వెనుక పీకే ప్లాన్ ఉందని అంటున్నారు రాజకీయ నిపుణులు. తన పార్టీ అభ్యర్థి కాకపోయినా, రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గెలుపు కోసం సీఎం కేసీఆర్ ప్రచారం చేయడం కాంగ్రెస్ కు షాకిస్తున్నదని టాక్. కేవలం బీజేపీ అభ్యర్థిని గెలిపించడం ఇష్టం లేకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా గెలుపుకై శ్రమిస్తున్నారు. ఈరోజు ప్రచారానికై హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ సిన్హాను సీఎం కేసీఆర్ బేగం పేట్ విమానాశ్రాయానికి వెళ్లి ఘనంగా స్వాగతించారు. ఇక పరోక్షంగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సిన్హాతో తాము కలిసేది లేదని చెప్పిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… పార్టీ నేతలకు కూడా అవే ఆదేశాలు ఇచ్చారట. రేవంత్ రెడ్డి ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన యశ్వంత్ సిన్హాను కలవొద్దని రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. మొత్తానికి ఇది టీఆర్ఎస్ కే ప్లస్ అయ్యాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకుంటున్న కేసీఆర్..బడా నేతలను కలుస్తూ.. తన సర్కిల్ ను పెంచుకుంటున్నారు. దేశంలో మరో బలమైన పార్టీగా టీఆర్ఎస్ ను అవతరింపజేయునున్నారు. కానీ సర్వేలు మాత్రం అందుకు బిన్నంగా ఉన్నాయి.
రేవంత్ రెడ్డి కోసం నెల్లూరు సంస్థ నిర్వహించిన సర్వేలో అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చేలా సర్వేలో ప్రజలు తీర్పు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ మార్క్ ను దాటిన టీఆర్ఎస్ కు.. తాజా సర్వేలో 44 స్థానాలు మాత్రమే వస్తాయని వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్సాహంగా కనిపిస్తోన్న కాంగ్రెస్ పార్టీ 54 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఇక ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్ లో దూకుడు పాలిటిక్స్ చేస్తున్న బీజేపీకి కేవలం 14 సీట్లే వస్తాయని సర్వేలో స్పష్టమైంది. ఎంఐఎం పార్టీ ఏడు సీట్లతో పాతబస్తీలో తమ పట్టు కాపాడుకుటుందని తాజా సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతానికి టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉన్నా ఇంకొంత కష్టపడితే కారు పార్టీకి 60 సీట్ల వరకు రావొచ్చని సర్వేలో తేలిందని తెలుస్తోంది.