అసలే ముంబై.. శవాల పక్కన కరోనా పేషంట్లకు చికిత్స  - MicTv.in - Telugu News
mictv telugu

అసలే ముంబై.. శవాల పక్కన కరోనా పేషంట్లకు చికిత్స 

May 7, 2020

Shocking Video Bodies Next To Coronavirus Patients In Mumbai Hospital

మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో కనీవినీ ఎరుగని కరోనా ఘోరం చోటు చేసుకుంది. పక్క బెడ్ల మీద కరోనాతో చనిపోయినవారి మృతదేహాలు. ఆ పక్క బెడ్లలోనే కరోనా పేషెంట్లకు కరోనా చికిత్స చేస్తున్నారు. శవాల మధ్య కరోనా రోగులకు చికిత్స జరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణ పరిస్థితులా అని వాపోతున్నారు. ముంబై మునిస్పల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న సియాన్‌ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.  బీజేపీ ఎమ్మెల్యే నితీశ్‌ రాణే ఈ వీడియోను ట్వీట్ చేశారు. సియాన్‌ ఆసుపత్రిలో మృతదేహాల పక్కనే నిద్రిస్తున్న రోగులు! మరీ ఇంత ఘోరం. ఇదేం పాలన? సిగ్గుపడాలి!అని ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వీడియోను పంచుకున్నారు. నల్లటి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టబడిన మృతదేహాలు వరసగా బెడ్ల మీద ఉన్నాయి. వాటి పక్క బెడ్లలోనే కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 

అయితే ఈ విషయమై సదరు ఆసుపత్రి డీన్‌ ప్రమోద్‌ ఇంగాలే అందుకు కారణాన్ని వేరేలా చెబుతున్నారు. కరోనాతో మృతిచెందినవారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వారి బంధువులు ముందుకు రావడం లేదని స్పష్టంచేశారు. అందువల్లే మృతదేహాలను ఆసుపత్రి బెడ్ల మీద ఉంచినట్లు తెలిపారు. మార్చరీలోని ఉన్న 15 స్లాట్లలో 11 ఇది వరకే నిండిపోయాయని… ప్రస్తుతం కోవిడ్‌ మృతదేహాలను తరలించామని చెప్పారు. తరలించే ఏర్పాట్లలో ఉండగానే ఎవరో వీడియో తీసి ఉంటారని.. ఘటనపై విచారణ జరుపుతున్నామని వివరించారు. మృతదేహాల నుంచి కరోనా వ్యాపించే అవకాశం లేదని అన్నారు. కాగా, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,800కు చేరుకోగా, ఒక్క ముంబైలోనే 10,714 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.