కశ్మీర్‌పై నోరుపారేసుకున్న అక్తర్.. వేరే పనిలేదేమో! - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌పై నోరుపారేసుకున్న అక్తర్.. వేరే పనిలేదేమో!

April 7, 2018

రాజకీయాలు, మతం, క్రీడలు.. అన్నీ కలగాపులగం అయిపోతున్నాయి. మనదేశంలోనే కాదు, పాకిస్తాన్ లోనూ అదే తంతు. పబ్లిసిటీ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా మాట్లాడేస్తున్నారు. తమకు తెలియని విషయాలపై స్వీపింగ్ కామెట్లు చేసేస్తున్నారు. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం అమాయకులను ఊచకోత కోస్తోందని పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే మరో పాక్ మాజీ ఆటగాడు షోయబ్ ఆక్తర్ విషం చిమ్మాడు..భారత్ అంటే ముస్లింల అణచివేత, కశ్మీర్ గొడవలే అన్నట్లు మాట్లాడాడు. ‘సల్మాన్‌కు బెయిలు వచ్చింది.. ఏదో ఒక రోజు కశ్మీర్, పాలస్తీనా, యెమన్, ఆఫ్ఘానిస్థాన్ సహా ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాలకు స్వాతంత్ర్యం లభిస్తుందన్న వార్త వింటాను..’ అని ట్వీట్ చేశాడు. ఈ ప్రాంతాల్లోని ప్రజలను చూస్తుంటే తన మనసంతా ద్రవించిపోతోందని, అమాయకులు చనిపోవడం కలచివేస్తోందని అన్నాడు. ఒక పక్క ఇలా రెచ్చగొడుతూనే మరోపక్క భారత్, పాకిస్తాన్ ప్రజలు తమ వివాదాలను కలసి పరిష్కరించుకోవాలని చెప్పొకొచ్చాడు.

అక్తర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, యెమెన్, అఫ్ఘాన్ వంటి దేశాలకు ఇప్పటికే స్వతంత్రం ఉందని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఎవరో ముల్లాలు, ఉగ్రవాదులు చెప్పిన మాటలు కాకుండా సొంత బుర్రతో ఆలోచించాలని గడ్డిపెడుతున్నారు. బలూచిస్తాన్‌లో, ఖైబర్ ప్రాంతంలలో పాకిస్తాన్ ఆర్మీ ఎంతమంది పొట్టనబెట్టుకుందో నీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. పాక్ మాజీ ఆటగాళ్లకు వేరే పనిలేదని, భారత్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టకున్నారని, అందుకు అక్కడి పాలకులు డబ్బులు ఇస్తున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.