అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులు కలకలం రేపాయి. పలువురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో చిన్నారి సహా ఆరుగురు మరణించారు. సోమవారం తెల్లవారుజామున సెంట్రల్ కాలిఫోర్నియాలో ఈ కాల్పులు జరిగాయి. ఇద్దరు నిందితులు కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. అనుమానితులకు కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు.
డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉన్నట్లు అనుమానం:
నిందితులు ఓ ఇంటిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపి కుటుంబాన్ని మొత్తం చంపినట్లు పోలీసు అధికారి బౌడ్రియాక్స్ విలేకరులతో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను తులారే కౌంటీ షెరీఫ్ కార్యాలయం (TCSO) ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. మృతి చెందిన వారిలో 17 ఏళ్ల తల్లి, ఆమె ఆరు నెలల పాప కూడా ఉన్నారని తెలిపారు. దాడి వెనుక పెద్ద ఉద్దేశ్యం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు నిందితుల కోసం పోలీసులు సెర్చింగ్ :
TCSO ఫేస్బుక్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటనలో కనీసం ఇద్దరు అనుమానితులు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కుటుంబంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు సంబంధించిన రెండు గ్యాంగ్ లు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కాల్పులకు సంబంధించి వారం రోజుల క్రితం బాధితుల ఇంటి దగ్గర నార్కోటిక్స్ సెర్చ్ వారెంట్ అమలు చేశారు.