షా.. షా.. షా.. షార్ట్ ఫిలిం ! - MicTv.in - Telugu News
mictv telugu

షా.. షా.. షా.. షార్ట్ ఫిలిం !

June 20, 2017

షార్ట్ కట్ లో దూసుకుపోవాలి.. లాంగ్ జర్నీ క్యా కర్తె యార్.. చిన్నగా, షార్పుగా చెప్పి బిగ్ స్క్రీన్ కు నీ రంగీన్ కలలను అప్లై చెయ్, డైరెక్టర్ గా వెండితెర మీద నీ ప్రతాపం చూపెయ్. టాలెంట్ నీలో సూపర్ గా వుంది కానీ నిన్ను జబ్బ చరిచి ప్రోత్సహించేదెవరు చెప్పు ? అందుకే నీకు నవ్వు ఏదో ఒక వెదుకులాట చెయ్యాలి.. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి.. నీ టాలెంటును పది మంది ఇండస్ట్రీ పెద్దవాళ్ళు గుర్తించాలంటే నువ్వు ఏం చెయ్యాలి ? పిలిచి పిల్లనిచ్చినట్టు నిన్ను నమ్మి నీకు సినిమాను ఇవ్వడం అనేది కలగానే మిగిలి పోతుంది ? కాబట్టి ఆ కలను నిజం చేస్కోవాలంటే షార్ట్ సినిమా అనే రూటును ఎంచుకో.. ఫ్రెండ్స్ ను జమ కట్టుకో.. తలా ఇంత వేసేసి తీసెయ్.. కంటెంట్ కరెక్టుగా, లైన్ యూనివర్సల్ గా వుందనుకో నిన్ను హార్ట్లీగా వెల్ కమ్ చెప్తుంది సినీ జగత్తు..  

నో లాంగ్.. ఓన్లీ షార్ట్

లాంగ్ సఫర్ నో యార్.. షార్ట్ గా ఒక లైన్ దానికి మంచి టేకింగ్ తోని షూట్ చేసినవనుకో.. నువ్వే బికమ్ ఏ గుడ్ డైరెక్టర్. అప్పటి లాగ ఇప్పుడు పరిస్థితులు లేవు. జమానా మారిపోయింది. మారుతున్న జమానా వెంట మనం అప్ డేట్ అవకపోతే పరేషాన్ అయిపోతం, పరుగుల వెనకబడిపోతం. కాబట్టి మనం ముందుకు ఉరకాలంటే బూస్ట్ లెక్క నీ గొంతులో, గుండెలో ఆశావాదాన్ని నిలిపి నిన్ను అజేయుణ్ని చేసే ఒకే ఒక్క హత్యారా షార్ట్ ఫిల్మ్.

ఇప్పుడు ఎవర్ని చూసినా షార్ట్ ఫిల్ములు తీసేస్తున్నరు. డైరెక్టర్లు అయిపోతున్నరు. షార్ట్ టైంల తమ బిగ్ డ్రీమ్ ను నిజం చేస్కుంటున్నరు. ఆక్టర్లు, టెక్నీషియన్లు కూడా చాలా మంది ఇప్పుడు షార్ట్ ఫిల్ముల ద్వారానే వెండితెర మీద విలాసమాడుతున్నారంటే ఈ బుడ్డ సినిమాల హవా ఎంత గట్టిగ వీస్తున్నదో జర ఒక నజర్ వెయ్యాలె…

బిఫోర్ షార్ట్ ఫిలింస్

కళను వరంగా, జన్మతహా పొందినవాడు తన కలను నిజం చేస్కోవడానికి ఆ అవకాశాలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి పోతాడు. ఛాన్సుల కోసం పోరాడుతాడు.. కాళ్ళు పట్టుకుంటాడు.. కాళ్ళొత్తుతాడు.. కడివెడు కన్నీళ్ళను దిగ మింగుతాడు.. ఆకలిని జయిస్తాడు.. ఆశయం కోసం అలుపెరగని బాటసారిలా పడుతూ లేస్తూ పల్టీలు కొడుతూ, డక్కా మొక్కీలు తినీ తినీ అలిసిపోడు, ఓటమికి అస్సలు వెన్ను చూపడు.., అయినవారి ప్రేమానురాగాలకు దూరంగా వెలేసినట్టు పట్నం తొవ్వ పడతాడు.. పట్టుదలగా అనుకున్నది సాధించడానికి నిర్విరామంగా కృషి చేస్తూనే వుంటాడు… అలా అనుభవం కోసం సీనియర్ డైరెక్టర్ల దెగ్గర అప్రెంటీస్ గా జాయినయి, తిండికి తిప్పలు పడుతూ, భీభత్సమైన చాకిరీ చేస్తూ, పని నేర్చుకుంటూ నెమ్మదిగా అసిస్టెంట్ డైరెక్టరుగా, అసోసియేట్, ఆ తర్వాత కోడైరెక్టరు ఇలా.., ఒక్కొక్క దశను దాటుతూ వివక్షలకు వెనకబడుతూ, అయినా వాటిని చిరునవ్వుతో దాటుకుంటూ డైరెక్టరుగా ప్రమోటవ్వడానికి ప్రొడ్యూసర్ ను పట్టుకునే క్రమంలో నానా పాట్లు పడి ఆఫ్టర్ లాంగ్ టైంలో డైరెక్టరుగా ఎస్టాబ్లిష్ అవుతాడు.   

కానీ ఇప్పుడూ.. ఆ పరిస్థితుల్లేవు.. అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు జమీన్ ఆస్మాన్ ఫరకుంది. మంచి థీమ్ అనుకొని చక్కటి స్క్రీన్ ప్లే అల్లుకొని ఫైవ్ మినిట్స్ నుండి ట్వెంటీ మినిట్స్ బిలో షార్ట్ ఫిలిం తీస్తె చాలు సినీ జగత్తును దానితో ఒప్పించవచ్చు, బిగ్ స్క్రీన్ డైరెక్టరుగా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. షార్టుగా.. స్వీటుగా.. సుత్తిలేకుండా.. మీరు సినిమాకు అనుకున్న కథను కుదించి ఒక్క షార్ట్ ఫిలిం తీస్తే చాలు.

యూట్యూబ్

తీసిన షార్ట్ ఫిలంలను ప్రదర్శించుకోవాలంటే ఏ ప్రసాద్ ల్యాబో, రామానాయుడు స్టూడియోనో, సారథి స్టూడియోనో రెంటుకు తీస్కొని ప్రదర్శించుకోవాలి. అలా ప్రదర్శించాలంటే పది నుండి ఇరవై వేల మధ్య ఖర్చు అవుతుంది. షార్ట్ ఫిలిం తియ్యటానికే ఇరవై వేలు ఖర్చు చేసుండరు. మరి అంత ఖర్చు పెట్టలేరు కదా.. అందుకే వారందరికీ ది వండర్ డయాస్ యూట్యూబ్. చేసిన షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే చాలు. వీవ్స్ ని బట్టి రెమ్యూనరేషన్ కూడా ఇస్తుంది యూట్యూబ్. చిన్న సినిమాలు తియ్యాలనుకునేవారికి యూట్యూబ్ బెహెత్రీన్ మంచ్ హై !

షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్

యువతరమంతా చాలా ఉత్సాహంగా షార్ట్ ఫిలింస్ తీస్తున్నారు యూట్యూబులో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఈ అంగారకుల్లాంటి టాలెంటర్స్ ని ఎంకరేజ్ చెయ్యటానికి షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాయి కొన్ని ప్రైవేటు సంస్థలు. వాటిలో ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఈ ఇయర్ నయీ షురువాత్ లా ప్రారంభించిన ‘ చిత్రపురి అవార్డ్స్ ’ గొప్ప సక్సెస్ అయింది. కార్తిక్ సుంకరి కోఆర్డినేషన్ లో ఈ ఫంక్షన్ చాలా అట్టహాసంగా జరిగింది. ఎవ్రీ ఇయర్ ఈ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ నిర్వహిస్తామని చెప్తున్నారు. ఈ కాంపిటీషన్ లో పార్టిస్పేట్ చేసేవి ఓన్లీ తెలుగు షార్ట్ ఫిలింస్ మాత్రమే కాదు అన్నీ భాషల్లోని షార్ట్ ఫిలింస్ ఎంట్రీలను ఆహ్వానించి అందులోంచి ది బెస్ట్ అనిపించినవి సెలెక్ట్ చేసి వాటికి చిత్రపురి అవార్డ్స్ ఇవ్వడం గొప్ప ఆచారం. అలాగే జగిత్యాల నుండి కూడా ఇలాంటి ఫెస్టివల్స్ ను నిర్వహిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సైతం ‘ వివక్ష ’ అనే టాపిక్ మీద కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. కొన్ని టీవీ ఛానళ్లు కూడా ఇలాంటి కాంపిటీషన్ లు నిర్వహించి యూత్ కు వెన్నుదన్నుగా నిలబడుతున్నాయి.

వరల్డ్ 1st షార్ట్ ఫిలిం

ఇంతగా షార్ట్ మూవీల హవా వూపందుకోవడానికి ఊతమిచ్చిందెవరు అంటే వరల్డ్ ఫస్ట్ షార్ట్ ఫిలింగా ‘ న్యూ వార్క్ అథ్లెట్ ’ ( Newark athlete ) ను ప్రస్తావించక తప్పదు. దీనికి బీజం వేసింది దర్శకుడు విలియమ్ డిక్సన్ పేరు ప్రముఖంగా వినబడుతున్నది. 1891 లో వచ్చిన ఈ మూకీ షార్ట్ ఫిలిం నిడివి కేవలం నిమిషం లోపలే. బ్లాక్ అండ్ వైట్ లో వుంటుంది ఈ షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలిం వ్యవస్థకు ఈ సినిమానే ఆజ్యం పోసిందని చెప్పుకోవచ్చు.

ది బెస్ట్ ఇండియన్ షార్ట్ ఫిల్మ్స్

షార్ట్ ఫిల్మ్ వ్యవస్థ నెమ్మదిగా తన పరిధిని విస్తరించుకుంటూ ఖండాంతరాల వరకు పాకింది. వరల్డ్ వైస్ గా అన్నీ లాంగ్వేజుల్లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. చాలా మంది తమ సత్తా చాటి స్టార్ డమ్ ని క్రియేట్ చేస్కుంటున్నారు.

ది బెస్ట్ అండ్ బెస్ట్ అనిపించిన షార్ట్ ఫిలిమ్స్ వాటిని తీసిన డైరెక్టర్ల గురించి కొంత చూద్దాం..

 1. చట్నీ ( జ్యోతి కపూర్ దాస్ )
 2. ఇంటీరియర్ కేఫ్ నైట్ ( అధిరాజ్ బోస్ )
 3. క్రితి ( శిరీష్ కుందర్ )
 4. ప్లేయింగ్ ప్రియా ( ఆరిఫ్ అలీ )
 5. నో స్మోకింగ్ ( విభూ పూరి )
 6. మమాస్ బాయ్స్ ( అక్షత్ వర్మ )
 7. ఖమాఖ ( ఆర్తి యస్ బాగ్డి )
 8. లవ్ షాట్స్ ( తాహిర్ రాజ్ భాసిన్ )
 9. అహల్య ( సుజయ్ ఘోష్ )
 10. అద్వైతం ( అద్వైతం ప్రదీప్ )
 11. నిశీధి ( కెవీఆర్. మహేంద్ర )
 12. రాజిగ వొరి రాజిగ ( జయప్రకాష్ తెలంగాణ )
 13. యాది ( నరెందర్ గౌడ్ నాగులూరి )
 14. 1973 అన్ అన్ టోల్డ్ స్టోరీ ( నటరాజ్ మహర్షి )
 15. ఎక్స్ ప్రెస్ లవ్ ( యంఎస్. విష్ణు )
 16. సైన్మా ( తరుణ్ భాస్కర్ )
 17. మధురం ( ఫణీంద్ర నర్సెట్టి )
 18. పరోక్ష ( గణేష్ శెట్టి )
 19. లాలి ( పూజితా ప్రసాద్ )
 20. ఎన్ కరెప్టెడ్ ( కామేష్ మారన్ )

ఇవి కేవలం చూచాయి లెక్క మాత్రమే. ఇంకా చాలా వున్నాయి లెక్కలోని రాని గొప్ప గొప్ప షార్ట్ ఫిలింస్. లవ్, కామెడీ, క్రైమ్, సోషల్, హర్రర్, థ్రిల్లర్, సోషియో ఫాంటసీ.., ఇలా చాలా జోనర్స్ లో షార్ట్ ఫిలింస్ తీసి నేషనల్, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కి పంపించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందుతున్నారు షార్ట్ ఫిలిం మేకర్స్.  ఇది చాలా అధ్భుతమైన విషయం కదా. ఉన్న జర్రంత టైంలో మొత్తం కథను కన్వినెన్సుగా చెప్పడం అనేది తల్వార్ పే ఫైస్లా లాంటిది !

సినిమాల్లో ఆల్ రెడీ డైరెక్టర్లైన వాళ్ళు సైతం షార్ట్ ఫిలింస్ తీస్తున్నారు. కహానీ సినిమా డైరెక్టర్ సుజయ్ ఘోష్ ‘ అహల్య ’ అనే షార్ట్ ఫిలిం తీసి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాడో మనందరికీ తెల్సిందే. ఇది ఒక మైథలాజికల్ సబ్జెక్ట్. రామాయణంలోని అహల్యను బేస్ చేస్కొని ఇప్పటి ట్రెండుకు అన్వయించి మరీ చేసిన అత్యద్భుతమైన పొట్టి సినిమా ఇది. రాధికా ఆప్టేకి కూడా చాలా గొప్ప పేరును తీస్కొచ్చిన షార్ట్ ఫిల్మ్ అహల్య.

ఇక వర్మ కూడా షార్ట్ ఫిలింస్ తీస్తున్నాడు. ఆ మధ్య ‘ మంచు లక్ష్మి పాదాలు ’ అనే షార్ట్ ఫిల్మ్ తీసి నవ్వుల పాలైనా.. ఈ మధ్య ‘ మేరీ బేటీ సన్నిలియోని బన్నా చాహ్తీ హై ’ అనే షార్ట్ ఫిలిం తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.      ‘ యష్ రాజ్ ఫిలింస్ ’ అనే పేరున్న సంస్థ సైతం షార్ట్ ఫిలింస్ సైడు మొగ్గు చూపుతోంది అంటే సమజ్ చేస్కోవచ్చు షార్ట్ ఫిలింస్ ఎంతగా సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్నాయో ! ?

నసీరుద్దీన్ షా, రాధికా ఆప్టే, మనోజ్ బాజ్ పాయ్, సింగర్ సునిధీ చౌహాన్, నీనా గుప్తా, అదితీరావ్ హైదరీ, హర్షవర్ధన్ రాణె, మంజరి ఫడ్నిస్, నిమ్రత్ కౌర్, సన్ని లియోని, సింగర్ సునీత, రీతూ వర్మ, చాందినీ చౌదరీ  ఇలా చాలా మంది కొత్తవాళ్ళే కాదు ఆల్ రెడీ ఫేమ్ లో వున్నవాళ్ళు కూడా షార్ట్ ఫిలింస్ లో నటించి ఇంకా ఫేమస్సయ్యారు. చాలా మంది న్యూ ఆక్టర్స్ బిగ్ స్క్రీన్ కు అప్లై అయ్యారు.

అలాగే సుజీత్ అనే దర్శకుడు 40 వరకు షార్ట్ ఫిలింస్ తీసి తర్వాత శర్వానంద్ తో ‘ రన్ రాజా రన్ ’ సినిమా తీసి ఇప్పుడు ఏకంగా బాహుబలి ప్రభాస్ తోనే ‘ సాహో ’ సినిమా చేస్తున్నాడు. అలాగే అద్వైతం షార్ట్ ఫిల్మ్ తీసి దాన్నే ఇంటి పేరుగా మార్చుకొన్న ప్రదీప్ ‘ బిల్లా రంగా ’ అనే ఫీచర్ ఫిల్మ్ కూడా తీసాడు. ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి సైతం తొలుత షార్ట్ ఫిలింసే తీసాడు. తరుణ్ భాస్కర్ ‘ సైన్మ ’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి ఎరుకే. మేర్లపాక గాంధీ కూడా  ‘ ఖర్మరా దేవుడా ’ అనే షార్ట్ ఫిలింతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకొచ్చి ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా ’ అనే ఫుల్ లెంగ్త్ సినిమాలు తీసి తన సత్తా చాటుకున్నాడు.  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది షార్ట్ ఫిలింస్ నుండి వచ్చినవారే కన్పిస్తారు మనకు.

యాది

ఎన్నెన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ తెలంగాణ సర్కార్ నుండి అవార్డులు గెటుచుకుంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆత్మ బలిదానాల వల్ల వాళ్ల వాళ్ళ కన్నవాళ్లకు ఎదురయ్యే కడుపుకోతను చాలా హృద్యంగా తీసారు డైరెక్టర్. తర్వాత ఆర్ట్ ఎట్ హాట్, పేరిణి వంటి డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ‘ హృదయాంజలి ’ అనే ఫీచర్ ఫిల్మ్ తీసే పనిలో వున్నారు.

రాజిగ వొరి రాజిగ

జయప్రకాష్ తెలంగాణ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అప్పటి ఆంధ్రా వలసవాదుల దురాక్రమణ వల్ల ఎంత మంది తెలంగాణ వాళ్ళు తమ అస్థిత్వాలను కోల్పోయి బండరాళ్ళుగా బతికారో చక్కటి స్ర్కీన్ ప్లే తో చూపించారు దర్శకులు. ఈ కథ నమస్తే తెలంగాణ బతుకమ్మ సండే మ్యాగజైన్ లో కథగా ముందు రాసారు జయప్రకాశ్ తెలంగాణ. ప్రస్తుతం యూఎస్ లో వుంటూ హాలీవుడ్ సినిమాలకి క్రియేటివ్ డిపార్ట్ మెంటులో వర్క్ చేస్తున్నారు.

నిశీధి

కెవీఆర్ మహేంద్ర డైరెక్షన్ లో వచ్చిన ‘ నిశీధి ’ లెక్ఖ లేనన్ని అవార్డులు గెలుచుకుంది. ముఫ్పై ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో, 65 ఇండియన్ ఫిలిం పెస్టివల్స్ లో ది బెస్ట్ షార్ట్ ఫిలింగా అవార్డుల పంట పండించింది. అప్పటి యాంటీ తెలంగాణ నేపథ్యంలో చాలా ఎమోషనల్ గా వుంటుంది స్టోరీ. ప్రస్తుతం ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ ప్లానింగ్ లో వున్నారు దర్శకులు.

ఎక్స్ ప్రెస్ లవ్

60 లక్షల వీవ్స్ ను రీచ్ అవుతోంది.. ఇంకా వీవర్స్ పెరుగుతూనే వున్నారు . Ms. విష్ణు దర్శకత్వంలో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ రెండు పార్టులుగా వచ్చింది. సినివారం, వరంగల్ కళావైభవంలో ప్రదర్శనకు నోచుకుంది. యూట్యూబ్ లో అత్యధిక వీవర్స్ ని సొంతం చేస్కున్న మంచి ఫీలున్న లవ్ షార్ట్ ఫిల్మ్ ఇది. ఫస్ట్ పార్ట్ లో చూస్కోవడం తర్వాత పార్ట్ లో ఒక్కటయ్యే లవర్స్ ఫీల్ ను అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్.

1973 అన్ అన్ టోల్డ్ స్టోరీ

నటరాజ మహర్షి దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం చాలా ఫెస్టివల్స్ లో పురస్కారాలు గెలుచుకుంది. అప్పటి రైతు ధీన స్థితిని చక్కగా పిక్చరైజ్ చేసాడు దర్శకుడు. ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన రైతు బిడ్డ నితిన్ కు మంచి పేరొచ్చింది. తను ఇప్పుడిప్పుడే సిల్వర్ స్క్రీన్ మీద బిజీ అవుతున్నాడు.

సినివారం 

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ సినిమా గట్టిగా నిలబడటానికి కృషి చేస్తోంది. అందునా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులుగా శ్రీ మామిడి హరికృష్ణ గారు తెలంగాణ సినిమాను బతికించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రవీంద్రభారతి వేదికగా ప్రతీ శనివారం ‘ సినివారం ’ పేర ఒక గొప్ప కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని షార్ట్ ఫిలింస్ తీసినవారు ప్రదర్శించుకోవడానికి సరైన వేదిక లేక అలా యూట్యూబ్ లోనే అప్ లోడ్ చేస్కొని సంబుర పడుతున్న వారికి సినివారం ఒక గొప్ప వేదికయ్యింది. షార్ట్ ఫిలింస్ తీసేవారికి మంచి ఉత్ర్పేరకాన్నిస్తోంది సినివారం.

ఫ్రీగా షార్ట్ ఫిలిం ప్రదర్శన కల్పిస్తున్నారు. వారం వారం చాలా సందడిగా వుంటుంది రవీంద్ర భారతి. వచ్చే నాలుగేళ్లలో సినివారం నుండి 15 మంది డైరెక్టర్లను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేస్తానని మామిడి హరికృష్ణ గారు హామీ చేస్తూ యూత్ టాలెంటుకు వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. సినివారం కుటుంబంలో నరేందర్ గౌడ్ నాగులూరి, సతీష్ అట్ల, అక్షర కుమార్, సంఘీర్ హెచ్, బత్తిని వినయ్ కుమార్ గౌడ్, వున్నారు. ఇంకా చాలా మంది ఔత్సాహిక సినీ ప్రేమికులు సినివారం సభ్యలుగా చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంది లిస్ట్. మనం లిస్ట్ అవుట్ చెయ్యలేని చాలా గొప్ప గొప్ప షార్ట్ ఫిలింస్ వున్నాయ్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో తీస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింస్ ఎందరికో గొప్ప ఆదెరువు అవుతున్నాయన్నది నిజం !!

– సంఘీర్