ఫోన్ నెంబర్ ఇస్తావా లేక రేప్ చేయాలా?..యువతికి బెదిరింపులు - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ నెంబర్ ఇస్తావా లేక రేప్ చేయాలా?..యువతికి బెదిరింపులు

June 22, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రాజస్థాన్‌కు చెందిన ఓ యువతిని కొంతమంది యువకులు ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వలేదని, యువతిపై గ్యాంగ్ రేప్ చేస్తామని బెదిరించారు. దాంతో ఆ యువతి స్నేహితులు మధ్య బెదిరింపులకు పాల్పడిన వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గొడవ మరింత ముదరడంతో బార్ సిబ్బంది వారికి సర్దిచెప్పి బయటకు పంపించేశారు. అయినా ఆ యువతిని తాకాలని ప్రయత్నిస్తూ, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…”రాజస్థాన్‌కు చెందిన న్యూట్రిషనిస్ట్ అయిన యువతి హైదరాబాద్‌లో ఉంటూ అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో పనిచేస్తుంది. విక్రమ్, విష్ణు అనే ఆమె స్నేహితులు ఏడాది తర్వాత హైదరాబాద్‌కు రావడంతో గత శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఓటినో బార్‌కు వెళ్లారు. ఆ తర్వాత 1.30 గంటల సమయంలో సాద్, మాయాంక్ అగర్వాల్ అనే ఇద్దరు యువకులు ఆమె వద్దకు వచ్చి, ఫోన్ నంబరు ఇవ్వాలని అడిగారు. దానికి ఆమె నిరాకరించింది. దాంతో ఆమె స్నేహితులు విష్ణు, విక్రమ్ కల్పించుకోవడంతో వాగ్వివాదం పెరిగి గొడవకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన సాద్, విష్ణు, విక్రమ్‌లపై దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగక మరో ఆరుగురు స్నేహితులను బార్‌కు పిలిపించి వారితో విక్రమ్, విష్ణులపై దాడి చేయించాడు. ఈ ఘటనలో విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు” అని వెల్లడించారు.

మరోపక్క తనను తాకేందుకు వారు ప్రయత్నిస్తూ, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా కారులో బయటకు తీసుకెళ్లి, తనపై అత్యాచారం చేస్తామని, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగినట్లు ఆమె పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం తెల్లవారుజామున మయాంక్, సాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బాధిత యువతి, విష్ణు, విక్రమ్ సోమవారం సాయంత్రం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు.