లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆపాలి.. టీడీపీ నేతలు - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆపాలి.. టీడీపీ నేతలు

March 15, 2019

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను ఆపివేయాలని ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా సినిమా ప్రచార చిత్రాలు వున్నాయని అధికారికి వివరించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి చిత్రాన్ని అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ మాట్లాడుతూ.. ‘దివంగత ఎన్టీఆర్ జీవితకథ అని చెప్పి ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రను హైలైట్ చేశారు. దీని వెనకాల వైసీపీ పాత్ర వుంది. ఎన్నికల ముందు కావాలనే ఈ సినిమాను విడుదల చేసి టీడీపీని అప్రతిష్ట పాలు చేయాలని అనుకుంటున్నారు.

ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత వచ్చేలా, వైసీపీకి ఫేవర్ అయ్యేలా కుట్ర పన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠకు విఘాతం కలిగించేలా ఈ చిత్రాన్ని తీశారు. ప్రజల్లో చెడు సందేశాన్ని తీసుకువెళుతున్నారని మేము ఎన్నికల కమిషన్‌ను కలిశాం. ఆయన తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు’ అని తెలిపారు. మార్చి 22న విడుదల కానుంది ఈ సినిమా ఇప్పటికే వర్మ ప్రకటించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తమ చిత్రం విడుదల ఆగదని అంటున్నాడు వర్మ.