పాకిస్తాన్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఐపీఎల్ గురించి తన తొలినాటి సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన తొలిమ్యాచ్ కోల్‌కతా తరపున ఆడిందీ, ఆ మ్యాచులో సచిన్‌ను అవుట్ చేస్తే గంగూలీ హెచ్చరించిన వంటి విషయాలను పంచుకున్నాడు. ఆయన మాటల్లో.. ‘ గంగూలీ నాయకత్వంలో నేను కోల్‌కతా జట్టులో సభ్యుడిని. ఆరోజు ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. మ్యాచ్ చూడడానికి జనాలు విపరీతంగా వచ్చారు. నేను నా మొదటి ఓవర్లోనే సచిన్ టెండూల్కర్ వికెట్ తీశాను. ఓవర్ అయిపోయిన తర్వాత ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాను. ఇంతలో అభిమానులు నన్ను బూతులు తిట్టడం మొదలెట్టారు. ఇది చూసి గంగూలీ నావద్దకు వచ్చి.. సచిన్‌ను ఎందుకు అవుట్ చేశావు? ఎవరు చెప్పారు నీకు? మనం ఆడుతుంది సచిన్ సొంత గడ్డపైన అని మర్చిపోయావా? వాళ్లు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు. నువ్వు మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేయమని ఆదేశించాడు. సచిన్ వికెట్ తీయడం వల్ల ప్రేక్షకుల మాటలను పడాల్సి వచ్చింద’ని అక్తర్ వెల్లడించాడు. అయితే, ఆ మ్యాచులో కోల్కగా మొదట బ్యాటింగ్ చేసి 67 పరుగులకే ఆలౌటయింది. అనంతరం సచిన్ టీం బ్యాటింగుకు రాగా, శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య (17 బంతుల్లో 43) విజృంభణతో కేవలం ఆరు ఓవర్లోనే విజయం ముంబయి ఇండియన్స్ టీంకు దక్కింది. కాగా, ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే.