స్కూలు బ్యాగుల మోతపై సర్కార్లకు నోటీసు - MicTv.in - Telugu News
mictv telugu

స్కూలు బ్యాగుల మోతపై సర్కార్లకు నోటీసు

August 17, 2017

వీపులపై బండెడు పుస్తకాలతో ‘బాలకార్మికులు’ కాని బాలకార్మికుల్లా మారిపోతున్న చిన్నారుల కష్టాలపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. స్కూలు బ్యాగుల బరువు, పిల్లకు ఇచ్చే హోం వర్క్ లపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కార్లను గట్టిగా ఆదేశించింది. అక్టోబర్ నాటికి సమగ్ర వివరాలు అందించాలని స్పష్టం చేసింది.

మోయలేనన్ని పుస్తకాలు, చేయలేనంత హోం వర్క్ తో స్కూళ్లు పిల్లలను వేధించుకుతింటూ వారి హక్కులను కాలరాస్తున్నాయని హైదరాబాద్ లోని బాలల హక్కుల సంఘం హెచ్సార్సీకి ఫిర్యాదు చేసింది. ఎలాంటి ఆటపాటలూ లేకుండా స్కూళ్లు పిల్లలను రోజుకు 9 గంటలపాటు చదివిస్తూ వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాయని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ మోత బరువుపై ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం.. 1, 2వ తరగతుల విద్యార్థుల స్కూలు బ్యాగు బరువు 1.5 కేజీలకు మించకూడదు. 3,4,5 తరగతుల పిల్లల బ్యాగు 3 కేజీలు దాటొద్దు. 6,7 తరగతుల పిల్లల బ్యాగు 4 కేజీల లోపే ఉండాలి. 7,8,9 క్లాసుల బ్యాగుల బరువు 4.5 కేజీలు, 10వ తరగతి విద్యార్థుల బ్యాగు బరువు 5 కేజీల లోపే ఉండాలి. 1 నుంచి 5 తరగతుల పిల్లలకు ఎలాంటి హోం వర్కూ ఇవ్వకూడదు.