30 లక్షల కోట్ల నష్టం, 55 లక్షల మంది చదువుకు దూరం..  - MicTv.in - Telugu News
mictv telugu

30 లక్షల కోట్ల నష్టం, 55 లక్షల మంది చదువుకు దూరం.. 

October 12, 2020

Shutting Schools Over Covid May Cost India Over $ 400 Billion: World Bank

కరోనా వైరస్‌ మిగిల్చిన కల్లోలం అంతాఇంతా కాదు. పెద్దవాళ్లు పనులు లేక, ఉద్యోగాలు కోల్పోయి, వ్యాపారులు వ్యాపారం చేసుకోలేక మూతపెట్టుకుని ఎంతో నష్టపోయారు. ఈ ఏడు నెలలు ఇంట్లో కుటుంబంతో గడిపారు అన్నమాటే గానీ, డబ్బులు లేక ఇబ్బందులు పడ్డ మాట మరింత వాస్తవం. వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మరోవైపు విద్యార్థులు చదువుకు ఎగనామం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏతావాతా ఒక సంవత్సరం చదువులు వారివి నష్టపోయినట్టే. విద్యాలయాలు మూతపడటంతో పిల్లలు బడికి దూరం అయ్యారు. అన్‌లాక్ 5.0 ప్రక్రియలో భాగంగా విద్యాసంస్థలు తెరచుకునేందుకు ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. అయినా  పాఠశాలలను పూర్తిస్థాయిలో తెరిచుకోవడంలేదు. ఇంకా కరోనా విజృంభిస్తుండటంతో బడులు తెరవడానికి జంకే పరిస్థితులు ఉన్నాయి. 

పాఠశాలలను సుదీర్ఘకాలం మూసివుంచితే అభ్యసన నష్టాలతో పాటు దేశ భవిష్యత్‌ ఆదాయంలో దాదాపు రూ.30 లక్షల కోట్లు (400బిలియన్‌ డాలర్లు) నష్టపోయే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో దక్షిణాసియా దేశాల్లోని విద్యార్థుల్లో ఎదురయ్యే అభ్యసన నష్టాలు, తద్వారా భవిష్యత్తులో దేశ ఆర్థికవ్యవస్థకు కలిగే నష్టాలను ‘బీటెన్‌ ఆర్‌ బ్రోకెన్‌?’ పేరుతో రూపొందించిన నివేదికలో స్పష్టంచేసింది. కరోనాతో దేశవ్యాప్తంగా మార్చి 16 నుంచి విద్యాసంస్థలు మూసిఉన్న విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకపోవడంతో కొత్త విషయాలను నేర్చుకోవడంలో వెనకబడటం, మరికొందరు నేర్చుకున్నవాటిని మరచిపోవడం జరుగుతుందని ప్రపంచబ్యాంక్‌ విశ్లేషించింది. ఈ సమయంలో అభ్యసన నష్టాలను అంచనా వేసేందుకు లెర్నింగ్‌-అడ్జెస్టెడ్‌ ఇయర్స్‌ ఇఫ్‌ స్కూలింగ్‌(LAYS)ను 0.5 సంవత్సరం నష్టాన్ని పరిగణలోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం 6.5గా ఉన్న LAYS 6.0సంవత్సరాలకు పడిపోతుందని ప్రపంచబ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది. ఇలాగే పాఠశాలలు మరికొంత కాలం మూసివుంటే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలతో పాటు భవిష్యత్‌ ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని తెలిపింది. 

దాదాపు 55 లక్షల మంది చిన్నారులు చదువుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపడం వల్ల ఒకతరం విద్యార్థుల ఉత్పాదకతపై ఈ ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రస్తుతం దక్షిణాసియాలో ఈ నష్టం 622 బిలియన్‌ డాలర్లు ఉండగా, ఇది గరిష్ఠంగా 880 బిలియన్‌ డాలర్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. కేవలం ఒక్క భారత్‌లోనే ఇది 400 బిలియన్‌ డాలర్లు ఉండే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణాసియా దేశాల జీడీపీ మరింత క్షీణించడంతో పాటు భారత్‌లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వివరించింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన 39 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు దూరంగానే ఉన్నారని వాపోయింది.