ఎస్సై బుల్లెటే.. నంబర్ ప్లేట్‌పై ఎన్నికల గుర్తు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్సై బుల్లెటే.. నంబర్ ప్లేట్‌పై ఎన్నికల గుర్తు..

March 17, 2019

వాహనాలు నంబర్ ప్లేట్ కనిపించకుండా దానిపై ఏదైనా రాసుకుంటే రూల్స్ ఒప్పుకోవు కదా. అయినా నేను ఎస్సైని కదా.. నాకు రూల్స్ ఏంటీ అని అనుకున్నట్టున్నాడు పాపం ఆయన. తాను నడిపే బుల్లెట్ నంబర్ ప్లేట్ కనిపించకుండా ఆయన ఏం చేశాడంటే.. బీజేపీ ఎన్నికల గుర్తును నంబర్ ప్లేట్‌పై ముంద్రించుకున్నాడు. సార్వత్రిక ఎన్నికలు  దగ్గర పడ్డాయి. ఎన్నికల కోడ్ కూడా అమలులో వుంది. కానీ అవేవీ తనకు వర్తించవు అనుకున్నట్టున్నాడు. అందుకే ఎంచక్కా వీధుల్లో బుల్లెట్ వేస్కొని తిరుగుతున్నాడు. ఆయనకు తెలీదేమో సోషల్ మీడియా ఒకటుంది, ఎవరో ఒకరు వీడియో తీసి తన బండారం బజారుకు ఈడుస్తారని. అదే జరిగింది అతని విషయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాక అతని జాబ్‌కే ఎసరు పడింది. పోలీస్ మీదే కేసు నమోదైంది.

 

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎటువంటి ప్రచార కార్యక్రమాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని తెలిసినా ఆ ఎస్సై ఎందుకింత పనిచేశాడు. కాగా, ఎస్సై నిర్వాకంపై ఓ పోలీస్ అధికారి స్పందిస్తూ.. ‘ఆ ఎస్‌ఐ వాడిన బైకును స్వాధీనం చేసుకున్నాం. ఆ ఇన్స్‌పెక్టర్‌ పేరు అవనీశ్‌ సింగ్‌గా గుర్తించాం. ఠాకూర్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌లో ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎస్‌ఎస్‌పీ కళానిధి తీవ్రంగా పరిగణించారు. నియమావళిని ఉల్లంఘించిన నేరం కింద ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్‌ 188 కింద ఈ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశాం’ అని తెలిపారు.

తెలిసి చేశాడో తెలియక చేశాడో గానీ తన ఉద్యోగానికే ఎసరు పెట్టుకున్నాడని యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీ ప్రచారాల్లో పాల్గొనొద్దని నిబంధనలు వున్నాయన్న విషయం మరిచిపోయాడా అని చెబుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మున్సిపల్‌ భవనాలు వంటి ప్రాంతాల్లో అనధికార రాజకీయ ప్రకటనలతో ఉన్న పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు, పార్టీ జెండాలను కూడా తొలగించాలని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.