లంచం తీసుకుంటూ దొరికిన ఎస్‌ఐ - MicTv.in - Telugu News
mictv telugu

లంచం తీసుకుంటూ దొరికిన ఎస్‌ఐ

March 24, 2022

huytg

తెలంగాణ రాష్ట్రంలో ఓ ఎస్‌ఐ లంచం తీసుకుంటూ దొరికిన సంఘటన సూర్యాపేట జల్లాలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న లవకుమార్‌ గురువారం లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. సూర్యాపేట ఎస్సైగా చివరి రోజు బాధ్యతల్లో ఉన్న అతను.. బదిలీపై వెళ్లే ముందు జేబులు నింపుకునేందుకు సిద్ధపడ్డాడు.

ఈ క్రమంలో రాజుగారి తోట హోటల్ యజమానిని భారీగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని హోటల్ యజమాని నేరుగా ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచనలతో రూ.1.30 లక్షల లంచం ఇస్తుండగా ఎస్సై లవకుమార్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరోపక్క ఎస్సై లవకుమార్‌ను బదిలీ చేస్తూ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ బుధవారమే ఆదేశాలు జారీ చేశారు. ఆయన శుక్రవారం ఎస్సీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంది. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో చివరి రోజు విధుల్లో ఉన్న లవ కుమార్ ఏసీబీ వలలో పడటం కలకలం రేపుతుంది. దీంతో ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్‌లో సోదాలు చేపట్టారు. సదరు ఎస్సైపై గతంలోనూ ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.