ఎస్ఐ వీరంగం.. వైసీపీ నేతపై ఫిర్యాదు చేశాడని స్టేషన్‌లో దాడి - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్ఐ వీరంగం.. వైసీపీ నేతపై ఫిర్యాదు చేశాడని స్టేషన్‌లో దాడి

May 2, 2022

తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన వ్యక్తిపై ఓ ఎస్ఐ దాడికి పాల్పడ్డాడు. బూతులు తిడుతూ పోలీస్ స్టేషన్ లోనే అందరి ముందు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనను పక్కనున్న వ్యక్తి వీడియో తీయడంతో విషయం బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంజీవరాయునిపల్లెకు చెందిన వేణు అనే వ్యక్తి తల్లి పద్మావతమ్మ దివ్యాంగురాలు. ఆమెకు ఫించన్ ఇవ్వకుండా అధికార పార్టీ నేత ప్రయత్నిస్తున్నారనేది బాధితుడు వేణు ఆరోపణ. పింఛన్ ఎందుకు ఇవ్వడంలేదని అడిగిన తనపై స్థానిక వైసీపీ నేత దామోదర్ రెడ్డి దాడికి పాల్పడ్డాడని , కేవలం తన తల్లి టీడీపీ మద్దతురాలన్న కారణంతోనే పింఛను తొలగించాలంటూ దామోదర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడని చెబుతున్నాడు. అన్ని అర్హతలు ఉన్న తన తల్లి ఫించను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ విషయంపై గురువారం రాత్రి సదరు వైసీపీ నేత ఇంటికి వెళ్లి నిలదీశాడు. గొడవ ముదరడంతో.. వేణు తాగి తన ఇంటి వద్ద గొడవ చేస్తున్నాడంటూ దామోదర్‌రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ సమయంలో అక్కడికి చేరుకుని వేణును మందలించి వెళ్లారు.

మరుసటి రోజు వేణు మరికొందరితో కలిసి దామోదర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వేణును చూసిన వెంటనే అకారణంగానే ఎస్ఐ రంగడు చెలరేగిపోయాడు. వేణుపై అసభ్యపదజాలంతో దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోలో ఎస్ఐ ‘ఎవరికి డబ్బులు ఇచ్చావ్, ఐదు వేలు చెప్పు. ఇంకొసారి వచ్చావంటే అంతే’ అని తీవ్ర ఆగ్రహంతో దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బాధ్యత గల పోలీస్ అధికారి ఇలా బూతులు తిడుతూ దాడికి పాల్పడడం సరికాదని స్థానికులు అంటున్నారు. నిజానిజాలు పరిశీలించి సమస్యను పరిష్కరించాల్సిన పదవిలో ఉండి దాడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ స్పందించారు. దాడిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్యను విచారణాధికారిగా నియమించారు . విచారణ ఆధారంగా చర్యలు ఉంటాయని ఎస్పీ వెల్లడించారు.