కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూ మరణించిన యోధులకు నివాళిగా గుండు చేయించుకున్న మధ్యప్రదేశ్ లోని ఖండ్వా ఎస్సైకి కరోనా సోకింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రంలో సంచలనం అవుతోంది. ఏప్రిల్ 15న ఆయనకు జరిపిన తొలి కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చింది. ఎసైకి కరోనా ఎలా సోకింది అనే అంశమై పోలీసులు, డాక్టర్లు సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎసైకి గుండు చేసిన బార్బర్ ద్వారా కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎసై మాట్లాడుతూ…‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి బార్బర్‌ను ఇంటికి ఎందుకు పిలుస్తాను. ఆరోజు ఎఎస్సై నాకు గుండు చేశారు. ఆ తరువాత నేను అతడికి హెయిర్ కటింగ్ చేశాను. కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయిన వారికి నివాళిగా మేము ఇలా చేశాం. నాకు కరోనా ఎలా సోకిందో దేవుడికి తప్ప ఎవ్వరికీ తెలియకపోవచ్చు. సరిహద్దు వద్ద డ్యూటీలో ఉన్నాను కాబట్టి రోజు అనేక లారీలను, ట్రక్కులను ఆపి చెక్ చేస్తుంటాను. వారిలో ఎవ్వరి ద్వారా నైనా నాకు కరోనా సోకి ఉండొచ్చు.’ అని ఆయన తెలిపారు.