స్వామీజీ అరెస్ట్.. మఠం వద్ద ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

స్వామీజీ అరెస్ట్.. మఠం వద్ద ఉద్రిక్తత

November 1, 2017

ఓ ముస్లింపై దాడి చేసి, ఆతని షాపును ధ్వంసం చేసిన కేసులో నిందితుడైన ఒక స్వామీజీని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. కలబుర్గి జిల్లా జెవర్గి తాలూకాలోని కరుణేశ్వర మఠం అధిపతి, హిందూ అతివాద శ్రీరామ సేనే గౌరవ చీఫ్ అయిన సిద్ధలింగ స్వామిని సోమవారం రాత్రి  అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుతోపాటు పలు కేసుల్లో నిందితుడైన ఈ స్వామి పక్షం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే సోమవారం అతడు  మఠానికి వచ్చినట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మఠం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలో పలువురు భక్తులు అక్కడికొచ్చి అల్లరి చేశారు. పోలీసులతో గొడవ పెట్టుకుని వారిపై రాళ్లు విసిరారు. పోలీసులు వారిని చెదరగొట్టి స్వామిని పట్టుకెళ్లారు. అయితే దారి మధ్యలో కెల్లూర్ క్రాస్ వద్ద కూడా భక్తులు రాళ్లు వేశారు. పోలీసులు లాఠీ చార్జి చేశారు. గొడవలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. నిరనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. సిద్ధలింగ స్వామి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని, బెదరింపులకు పాల్పడ్డారని పలు కేసులు ఉన్నాయి. స్వామి తనపై దాడి చేసి, తన చిన్న దుకాణాన్ని ధ్వంసం చేశాడని ఆందోళ్ గ్రామానికి చెందిన నిజాముద్దీన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.