'కేజీఎఫ్-2'పై సిద్ధార్థ్ హాట్ కామెంట్స్.. ఫన్నీగా ఉంది - MicTv.in - Telugu News
mictv telugu

‘కేజీఎఫ్-2’పై సిద్ధార్థ్ హాట్ కామెంట్స్.. ఫన్నీగా ఉంది

May 19, 2022

కన్నడ స్టార్ హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో ఇటీవలే విడుదలైన “కేజీయఫ్-2′ చిత్రం దేశ వ్యాప్తంగా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో విడుదలై పాన్ ఇండియా మూవీగా కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇటువంటి సమయంలో నటుడు సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేజీఎఫ్ 2’ను పాన్ ఇండియా అని పిలుస్తుంటే చాలా ఫన్నీగా ఉందని అన్నాడు.

“కేజీఎఫ్-2ని పాన్ ఇండియా అని వినడానికే ఎంతో ఫన్నీగా ఉంది. 15 ఏళ్ల నుంచి నేను వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నా, తమిళంలో చేస్తే తమిళయన్‌గా, తెలుగులో చేస్తే తెలుగు అబ్బాయిలా, ఇలా ఏ భాషలో వర్క్ చేస్తే ఆ భాషలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకొంటా. వేరేవాళ్ల చేత డబ్బింగ్ చెప్పించుకోను. నా వరకూ ఆయా చిత్రాలను ఇండియన్ ఫిల్మ్ అని పిలవడమే నాకు ఇష్టం. ఎందుకంటే, పాన్ ఇండియా అంటుంటే కాస్త అగౌరవంగా అనిపిస్తుంది. వేరే ఎవరినో ఇబ్బంది పెట్టాలని ఇలా చెప్పడం లేదు. చిత్రపరిశ్రమలో హిందీ సినిమాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి, ఆ భాష నుంచి విడుదలైన సినిమాలు ప్రేక్షకాదరణ పొందితే వాటిని బాలీవుడ్ అనే అంటారు. కానీ, ప్రాంతీయ చిత్రాలు విశేషమైన ప్రేక్షకాదరణ పొంది, భారీ విజయాన్ని అందుకున్నప్పుడు వాటిని ఎందుకు పాన్ ఇండియా అని పిలవడం? భారతీయ చిత్రం అని అనొచ్చు కదా” అని ఆయన అన్నారు.