అవి పాన్ ఇండియా మూవీలా? సిద్ధార్థ్ హాట్ కామెంట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

అవి పాన్ ఇండియా మూవీలా? సిద్ధార్థ్ హాట్ కామెంట్స్

May 2, 2022

సినీ ప్రియులకు హీరో సిద్ధార్థ్ అంటే తెలియని వారుండరు. ‘బాయ్స్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన వరుసగా.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘బొమ్మరిల్లు’, ‘ఆట’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొన్ని రోజులుగా అన్ని ఇండస్ట్రీలలో ‘పాన్ ఇండియా’ ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘బహుబలి’, ‘బహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఖ్యాతి చెందాయి. అయితే, హీరో సిద్ధార్థ్ మాత్రం ‘పాన్ ఇండియా’ అనే పదం వాడకూడదని, ఆ పదం తప్పు అని అంటున్నాడు.

ఇటీవలే ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఈ పాన్ ఇండియా అనేది ఆగౌరవమైన పదం. అదొక నాన్సెన్స్. బాలీవుడ్ కాకుండా ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న సినిమాల గురించి వర్ణించేందుకే ఆ పదం ఉపయోగపడుతుంది. బెంగళూరుకు చెందిన నా స్నేహితులు (యశ్, ప్రశాంత్ నీల్) కేజీఎఫ్’ అనే గొప్ప చిత్రం తెరకెక్కించారు. ఈ విషయంలో నేను గర్వపడుతున్నా. ‘రేబీయస్’ కన్నడ చిత్ర పరిశ్రమలో వచ్చిన భారతీయ సినిమా. ఈ చిత్రాన్ని మనకు కావాల్సిన భాషలో చూడొచ్చు. నన్నడిగితే పాన్ ఇండియా అనే పదాన్ని తొలగించాలనే చెప్తా.

15ఏళ్ల క్రితం దర్శకుడు మణిరత్నం తీసిన ‘రోజా’ సినిమాని భారతీయ సినీ ప్రేక్షకులంతా చూశారు. కానీ ఎవరూ దాన్ని పాన్ ఇండియా సినిమాగా పిలవలేదు. ఏ చిత్రాన్నైనా ఇండియన్ ఫిల్మ్ అనే పిలవాలి లేదా ఏ భాషలో రూపొందితే ఆ భాషా చిత్రంగా పరిగణించాలి తప్ప పాన్ ఇండియాగా కాదు. కంటెంట్ బాగుంటే సినిమాకు ఎలాంటి కొత్త పేర్లను పెట్టాల్సిన అవసరం లేదు” అని సిద్ధార్ అన్నారు.