మోడీ ఇంటర్వ్యూ... అక్షయ్ ఓ విలన్: సిద్ధార్థ్ - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ ఇంటర్వ్యూ… అక్షయ్ ఓ విలన్: సిద్ధార్థ్

April 24, 2019

కోలీవుడ్ వివాదాస్పద హీరో సిద్ధార్థ్ అప్పుడప్పుడు సంచలనాత్మక ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తనకు అనిపించిన ఫీలింగ్ పంచుకోవడంలో తప్పులేదు కదా అని వివరణ ఇస్తాడు. తాజాగా అతను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను విలన్‌గా సంబోధిస్తూ ట్వీట్ చేశాడు. అక్షయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీతో చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఈ ఇంటర్వ్యూ ప్రాధానత్యతను సంతరించుకుంది. ప్రధాని అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో బుధవారం జరిగిన ముఖాముఖిలో ప్రధానమంత్రి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అక్షయ్‌తో పంచుకున్నారు ప్రధాని మోడీ. 

అయితే ఈ ఇంటర్వ్యూపై సెటైరికల్ పంచ్ వేస్తూ ట్వీట్ చేశాడు సిద్ధార్థ్.  ‘అక్షయ్ కుమార్ ఒక విలన్.. ఆయనను తక్కువ అంచనా వేశాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై చాలా మంది యూజర్లు స్పందిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తన అసంతృప్తిని ఈ ట్వీట్ ద్వారా తెలియజేశారంటూ మోడీని వ్యతిరేకించే వర్గం సిద్దార్థ్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కొందరు సిద్ధార్థ్‌ను విమర్శిస్తున్నారు.

ఎన్నికల సందర్భంగా మోడీని రెండోసారి ప్రధానిని చేసేందుకు అక్షయ్ కుమార్ తనవంతు సాయం చేస్తున్నారంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు. ఇదిలావుండగా ప్రధాని ముందు కాలు మీద కాలు వేసుకుని అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేయడాన్ని తప్పుబడుతున్నారు మోడీ అభిమానులు. దేశ ప్రధానికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.