వరంగల్‌లో వైద్య విద్యార్థిని పీత్రి ఆత్మహత్య కేసు వీడకముందే ఎంజీఎంలో ఫోర్జరీ భాగోతం వెలుగు చూడడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సంతకంతో పాటు పలువురు ప్రొఫెసర్ల సంతకాలు ఫోర్జరీకి గురయ్యాయని వార్తలు వస్తున్నాయి. తన సంతకంతో పాటు మరో విభాగాధిపతి సంతకం కూడా ఫోర్జరీ జరిగినట్లు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రాష్ట్ర ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై త్వరలో శాఖాపరమైన విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
అయితే ఫోర్జరీ ఎవరు చేశారు అనే అంశం మాత్రం ఇప్పటికీ గుర్తించలేదని ఆయన తెలిపారు. సంతకం ఫోర్టరీ చేసిందెవరు ? దీని మూలంగా లబ్ధిపొందిన వారెవరు ? అనే అంశాలను విచారణలో గుర్తించాల్సి ఉందని అన్నారు. ఫోర్జరీ ఎప్పుడు జరిగింది. ఏ విషయంలో జరిగిందనే విషయాన్ని మాత్రం ఆయన తెలియజేయలేదు. త్వరలోనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధ్యులను గుర్తిస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పరిపాలన విభాగంలోని సూపరింటెండెంట్ పేషీతో పాటు మెడికల్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ విభాగాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నకిలీ బిల్లుల కోసం గానీ, అక్రమ నియామకాల్లో ఫోర్జరీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూపరింటెండెంట్ కార్యాలయంలో మాత్రమే శాఖాపరమైన పత్రాలపై, ప్రభుత్వానికి సమర్పించే నివేదికలు తదితర పత్రాలపై సంతకాలు చేస్తారు. రోగులకు సంబంధించి కేస్ షీట్స్‌పై సూపరింటెండెంట్ సంతకాలు చేయాల్సిన అవసరం లేకపోవడంతో ఈ రెండు విభాగాలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.