significance of bhogi mantalu and pallu,
mictv telugu

భోగభాగ్యాల హరివిల్లు…భోగీ పండుగ ముంగిళ్ళు

January 14, 2023

అందమైన రంగుల ముగ్గుల లోగిళ్ళు, ఎర్రని కాంతులతో మంటలు, పిల్లల సందళ్ళు, ఆడపడుచుల కిలకిలలతో తెలుగు లోగిళ్ళు కళ కళలాడుతున్నాయి. మూడు రోజులు ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చేసింది. సూర్యుడు దక్ణిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించేదానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అదే కాకుండా పాడి పంటలు ఇంటికి వచ్చే రోజులు ఇవి. ప్రతీ రైతులు ఇల్లు సిరిసంపదలతో తులతూగే సమయం. తమకు వచ్చిన పంటను ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది. కొత్త ధాన్యంతో పాలు పొంగించి పరమాన్నం చేసుకుంటారు.

ఇది నాలుగు రోజుల పండుగ. భోగితో మొదలై సంక్రాంతి, కనుమ, ముక్కనుమతో ముగుస్తుంది. భుగ్ అనే పదం నుంచి భోగీ వచ్చిందని అంటారు. భోగం అంటే సుఖం. రైతులకు పంట చేతికి వచ్చినప్పుడే కదా సుఖసంతోషాలు ఏమైనా. పురాణం ప్రకారం అయితే రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది కనుక ఈరోజును భోగిగా జరుపుకుంటారని ప్రతీతి. మరో కథ ఏంటంటే మరో కథనం మేరకు.. శ్రీ మహా విష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని.. అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు.

సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం అనుభవము. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అంటాము. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం.

ఇక ఈ భోగి గురించి చెప్పే మరో మాట ఏంటంటే భోగి మంటలు కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు, భోగభాగ్యాల ప్రతీకగా మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు అంటారు. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెలరోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది అనే నమ్మకం కూడా ప్రజల్లో బలంగా ఉంది.

ఇదంతా ఉదయం జరిగే తంతు…ఇక సాయంత్రం అయితే బొమ్మల కొలువు, భోగి పళ్ళు పోయడంతో ఇల్లంతా హడావుడి హడావుడిగా ఉంటుంది. ఐదేళ్ళలోపు చిన్నపిల్లలను కూర్చోపెట్టి తలమీద నుంచి రేగి పళ్ళు, పువ్వులు లాంటివి పోస్తూ వాళ్ళను ఆశీర్వదిస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే పేరు కూడా ఉంది. రేగి చెట్లు, పళ్ళు శ్రీమన్నారాయణ ప్రతి రూపం అంటారు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండే కూడాట. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళను, పువ్వులు, నాణేలు కలిపి పిల్లలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వలన శ్రీలక్ష్మీ నారాయణుల అనుగ్రహం పిల్లలపై ఉంటుందని, పిల్లలకు ఉన్న దిష్టి పోయి వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారని నమ్మకం. అలాగే ఇదే రోజున బదరీ వనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ పళ్ల(రేగు పళ్లు)తో అభిషేకం చేశారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్లుగా మారాయి. వీటితో పాటు పూలు, శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని మరో నమ్మకం కూడా ఉంది.