కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిన సమయంలో ఆలయంలో చోరీ జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరికి గురయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు తెలుస్తోంది. 15 కిలోల వెండితో పాటు కొన్ని బంగారు ఆభరణలు చోరీకి గురైనట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
చోరీ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకొచ్చింది. సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. డాగ్ స్క్వాడ్ టీమ్స్ రంగంలోకి దింపి దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వేలు ముద్రల సేకరణ తీసుకోగా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. మల్యాల సీఐ కొండగట్టుకు చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు.
కొండగట్టు ఆలయ చరిత్రలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. నిందితులు ముసుగు వేసుకుని వచ్చి చోరీకి పాల్పడ్డారని స్థానికులు అంటున్నారు. ఆలయం మూసివేసిన తర్వాత రాత్రిపూట నలుగురు హోంగార్డులు మాత్రమే సెక్యూరిటీగా ఉంటారు. అయినా ఈ చోరీ ఘటన జరగడం వివాదాస్పదంగా మారింది. చోరీ ఘటన నేపథ్యంలో ఆలయాన్ని అధికారులు మూసివేశారు.
ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా బడ్జెట్ లో ఆలయానికి నిధులు కేటాయించడంతో పాటు నేరుగా ఆలయాన్ని సందర్శించారు కూడా. దీంతో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఈ దొంగతనం వ్యవహరంతో మరోసారి అంజన్న ఆలయం వార్తల్లో నిలిచింది.