పైన ఫోటోలో ఉన్న మేక పిల్లను చూశారా.? ఆ బుజ్జి మేక పిల్ల త్వరలో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతుంది. ఆ ఫోటో చూస్తే మీకీపాటికే విషయం అర్ధమై ఉంటుంది. చాంతాడంత పొడుగున్న ఆ బుజ్జి మేక పిల్ల చెవులు.. అందర్నీ ఆకర్షిస్తున్నాయి. పాకిస్తాన్లోని కరాచీలో ఓ రైతు ఇంట్లో జన్మించిన ఈ మేక పిల్ల పుట్టినప్పుడు… దానికంటే దాని చెవులే ఎక్కువ పొడవున్నాయట. దీని యజమాని మహమ్మద్ హాసన్ దీనికి ముద్దుగా ‘సింబా’అని పేరుపెట్టారు.
19 అంగుళాల పొడవున్న చెవులతో ఈ మేక పిల్ల స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించడంతో.. అతి కొద్దికాలంలోనే హాసన్.. తన గ్రామంలో ఫేమస్ అయ్యాడు. అతని గురించి, అతని మేక గురించి తెలుసుకొని చాలామంది తన ఇంటికి వస్తున్నారని, తనతో సెల్ఫీలు దిగుతున్నారని సంబరపడిపోతున్నాడు.
త్వరలోనే తన మేక పిల్ల గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతోందని అతడు చెప్తున్నాడు. దాని ఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేస్తున్నాడు. అయితే ఈ మేక పిల్లలో జన్యు మార్పిడిగానీ, ఏదైనా జెనెటిక్ సమస్యగానీ ఉండడమే దాని చెవులు పెరగడానికి కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు.