122 ఏళ్ల‌లో ఇదే రికార్డ్: వాతావరణ శాఖ - MicTv.in - Telugu News
mictv telugu

122 ఏళ్ల‌లో ఇదే రికార్డ్: వాతావరణ శాఖ

April 30, 2022

కేంద్ర వాతావరణ శాఖ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. 122 ఏళ్ల చరిత్రలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కొట్టిన ఎండ‌ల‌ు రికార్డు సృష్టించాయని ప్రకటించింది. ఈ ఒక్క ఏప్రిల్ నెలలోనే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో కలిపి 35.9 నుంచి 37.78 డిగ్రీల సెల్సియ‌స్‌కి ఉష్ణోగ్ర‌త‌లు చేరుకున్నాయని తెలిపింది. అంటే దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఎండలు కొట్టినాయే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు కావ‌డమేనని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

వాతావ‌ర‌ణ శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర మాట్లాడుతూ..” మే, జూన్ మాసాలు రాక‌ముందే ఎండ‌లు భయంకరంగా విజృంభిస్తున్నాయి. మే, జూన్ మాసాల్లాగా ఉష్ణోగ్ర‌త‌లు మారిపోయాయి. గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హ‌ర్యానాలో ఎండ‌లు విప‌రీతంగా ఉన్నాయి. మే మాసంలో కూడా ఇలానే కొన‌సాగుతాయి. వాయువ్య‌, ఈశాన్య రాష్ట్రాలను మినహాయించి, దేశ వ్యాప్తంగా సాధార‌ణం కంటే ఎక్కువ‌గానే వర్షాలు పడుతాయి” అని ఆయ‌న వెల్ల‌డించారు.

మరోపక్క సాధారణంగా దేశ్యాప్తంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాడ్పులు సైతం మే నెలలోనే వీస్తుంటాయి. కానీ, ఈసారి భిన్నంగా ఏప్రిల్ నెలలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. వివిధ ప్రాంతాల్లో ఈ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని, 122 ఏళ్లలో ఇదే ప్రథమం అని అధికారులు తెలిపారు.