similar Symbols Shock To TRS
mictv telugu

అప్పుడు రోడ్డు రోలర్..ఇప్పుడు రోటీ మేకర్…

November 7, 2022

గుర్తుని పోలిన గుర్తులు గులాబీ గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో కారుని పోలిన గుర్తులు కంగారు పెట్టిస్తున్నాయి. టీఆర్ఎస్‌కు పడే ఓట్లను డైవర్ట్ చేస్తున్నాయి. చాలామంది కారు, కారుని పోలిన గుర్తులతో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కారులాగే ఉంది కదా ఈవీఎంపై నొక్కేస్తున్నారు. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత కారుని పోలిన గుర్తులకు వందల్లో కాదు వేలల్లో ఓట్లు పడుతున్నాయి. బై పోల్స్‌లో ఇది మరి ఎక్కువగా జరుగుతోంది.

కారు స్పీడ్‌కు బ్రేక్
టీఆర్ఎస్ ఊహించిందే జరిగింది. కారును పోలిన గుర్తులు కంగారుపెట్టించాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కారుని పోలిన గుర్తులకు 5వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఈ ప్రభావం టీఆర్ఎస్ మెజారిటీ పై పడింది. ఇలా ఓట్లు డైవర్ట్ కాకపోతే టీఆర్ఎస్‌కు 15 వేలకు పైగా మెజారిటీ వచ్చేది. అచ్చం కారులా కనిపించే రోటిమేకర్ గుర్తుకు ఏకంగా 2,407 ఓట్లు పడ్డాయి. ఇలాంటి గుర్తుల్ని ముందే తొలగించించాలని టీఆర్ఎస్ హైకోర్టుని ఆశ్రయించింది. ఈసీకి పలుమార్లు విజ్ఞప్తులు పెట్టుకుంది. అయినా కారుని పోలిన గుర్తులు ఈవీఎంలోకి ఎక్కాయి. టీఆర్ఎస్ అనుకన్నట్టే ఈ గుర్తుల ఎఫెక్ట్ మెజారిటీపై పడింది.

ఏ గుర్తుకు ఎన్ని ఓట్లంటే
రోటీ మేకర్ గుర్తుపై పోటీ చేసిన మారమోని శ్రీశైలం యాదవ్‌కు 2,407 ఓట్లు వచ్చాయి. రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ 1,874 ఓట్లు పొందారు. టెలివిజన్ గుర్తుకు 511, కెమెరా గుర్తుకు 502, ఓడ గుర్తుకు 153, చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు పడ్డాయి. రెండో ఈవీఎంలోని రెండో సంఖ్యలో ఉన్న ఏర్పుల గాలయ్య చెప్పుల గుర్తుకు 2270 ఓట్లు వచ్చాయి. మొదటి ఈవిఎంలో రెండవసంఖ్యలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కారు గుర్తు ఉండటంతోనే అలా జరిగింది. ఇవన్నీ టీఆర్‌ఎస్‌ గుర్తుకు పడాల్సినవే కానీ నిరక్షరాస్యులు, వృద్ధులు తెలియక వేయడంతో టీఆర్‌ఎస్‌ మెజార్టీ తగ్గింది.

గతంలో కూడా ఇలాగే…

గతంలోనూ టీఆర్ఎస్‌కు ఇలాగే జరిగింది.కారుని పోలిన గుర్తులు కలవరపెట్టాయి. అభ్యర్థుల గెలుపు, ఓటమిపై ప్రభావం చూపించాయి. దుబ్బాక ఉప ఎన్నికలో ఇదే జరిగింది. రోటిమేకర్ గుర్తుకు 4 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఈ ఓట్ల వల్లే తమ అభ్యర్థి ఓడిపోయారని అప్పట్లో ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మెజారిటీని భారీగా తగ్గించిన సందర్భలూ ఉన్నాయి.మునుగోడులో కూడా ఇదే జరిగింది. తమ అధిక్యాన్ని ఇలాంటి గుర్తులు తగ్గించాయని స్వయంగా కేటీఆరే చెప్పారు.