సాయంత్రం ఆరు కాగానే మనం ఎప్పుడు తలుపులు తెరుస్తామా అని వేచుకొని కూర్చుంటాయి దోమలు. అలా అని తలుపులు, కిటికీలను మూసేసుకొని కూర్చొలేం కదా! దోమల నివారణకు కొన్ని చిట్కాలు..చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా కుడతాయా దోమలు? ఈ సందేహం వచ్చిందా ఎవరికైనా! 85 శాతం మంది జన్యు కారణాల వల్ల దోమ కాటుకు గురవుతున్నారట. అంతేకాదు.. జీవక్రియ రేటు ఎక్కువగా ఉండి.. అధిక కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేసేవారి చెంతకు దోమలు చేరుతాయి. సెంట్లు కొట్టుకున్నవారికి, చెమట సమస్యలతో బాధేపడే వారి దగ్గరకు దోమలు చేరుతాయట. అంతేకాదండోయ్.. ఓ బ్లడ్ గ్రూప్ గల వారిని దోమలు ఎక్కువగా కుడతాయని ఒక పరిశోధనలో కూడా తేలింది. కాబట్టి వీరు తస్మాత్ జాగ్రత్త!
_ వెల్లులి వాసన కొంతమంది మనుషులకే కాదు.. దోమలకు కూడా ఇష్టం ఉండదు. వెల్లులి మెత్తగా చేసి దోమలు ఎక్కువగా ఉండే చోట్లలో పెట్టండి. దెబ్బకు దోమలు పారిపోతాయి.
_ నిమ్మకాయ ముక్కల్లో లవంగాలు గుచ్చడం ద్వారా కూడా దోమల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇవి పెట్టిన దగ్గరలోకి కూడా దోమలు రావు.
_ తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తాం. కానీ దోమలకు మాత్రం ఇది బద్ధ శత్రువు. తులసి ఆకులను నీటిలో మరిగించి వాటిని గదిలో అక్కడక్కడా చల్లండి. లేకపోతే తులసి నూనె కూడా దొరుకుతుంది. దాన్ని అయినా ఉపయోగించవచ్చు. పుదీనా ఆకులు కూడా దోమలను తరిమికొడతాయి.
_ తలుపులన్నీ మూసి కర్పూరం వెలిగించండి. 30 నిమిషాల తరువాత తలుపులు తెరిస్తే.. ఒక్క దోమ కూడా ఉండదు. బయట దోమలు లోపలికి రావు.
_ లెమన్ గ్రాస్ అని దొరుకుతుంది. వీటిని కూడా ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు రావు. ఒకవేళ పెంచడం కుదరకపోతే లెమన్ గ్రాస్ ఆయిల్ ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది. దాన్ని అయినా ఉపయోగించవచ్చు._ నిమ్మనూనె కూడా దోమలను తరిమివేయడంలో బాగా పనిచేస్తాయి. ఇంట్లో అక్కడక్కడా ఈ నూనెను స్ప్రే చేస్తే సరిపోతుంది.