ఎన్ని పోస్టులకైనా.. ఫిజికల్ టెస్ట్ మాత్రం ఒకేసారి - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్ని పోస్టులకైనా.. ఫిజికల్ టెస్ట్ మాత్రం ఒకేసారి

May 22, 2022

తెలంగాణ ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నెలరోజులు కావస్తుంది. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసిన వారికి పోలీస్ నియామక మండలి ఓ శుభవార్త తెలిపింది. పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడుతున్న అభ్యర్థులు, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసినా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరైతే సరిపోతుందంటూ తెలిపింది. అభ్యర్థులు ఒకసారి పాల్గొన్న రన్నింగ్, షాట్‌పుట్ , లాంగ్ జంప్ లాంటి పోటీలే కాకుండా వారి శారీరక కొలతల ఫలితాల్ని 3 నెలలపాటు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొంది. 2018లో తొలిసారి ఇలానే చేసిందని పోలీస్ నియామక మండలి తెలిపింది.

మండలి తాజా నోటిఫికేషన్లకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. క్రితం సారి దాదాపు 6 లక్షల వరకు రాగా ఈసారి ఇప్పటికే పది లక్షలకుపైగా వచ్చాయి. గడువు మరో అయిదు రోజులు మిగిలి ఉండటానికి తోడు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేయడంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.