Sin: A 15-year-old girl naked on the road..2 kilometers
mictv telugu

పాపం: నడిరోడ్డుపై నగ్నంగా 15ఏళ్ల బాలిక..2 కిలోమీటర్లు

September 23, 2022

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కామాంధుల కారణంగా ఓ 15 ఏళ్ల బాలిక నడి రోడ్డుపై రెండు కిలోమీటర్ల వరకు బట్టలు లేకుండా నగ్నంగా నడుచుకుంటూ, ఇంటికి వెళ్లింది. ఒంటి మీద నూలు పోగు లేదు, అక్కడక్కడా రక్తపు మరకలు, కండ్లనిండా కన్నీళ్లతో నడిరోడ్డుపై 2 కిలోమీటర్లపాటు నడిచి వెళ్తున్నా, రోడ్డుపై వెళ్తున్నవారు, చుట్టుపక్కల ఉన్న స్థానికులు కళ్లు అప్పగించి చూస్తున్నారే తప్పా, అయ్యో పాపం అన్నవారు లేరు. మరికొంతమంది ఆమె వీడియోలు తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 15 రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకొంది. పదిహేనేండ్ల బాలిక పని మీద పక్క గ్రామానికి వెళ్లగా, ఐదుగురు వ్యక్తులు ఆమెను అపహరించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురిచేసి లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక దుస్తులతో, ఇతర వస్తువులతో పరారైయ్యారు. దాంతో ఆ బాలిక ఏడుస్తూ, కాసేపు కూర్చుంది. చివరికి ఏం చెయ్యాలో అర్థంకాక, ఇంటికి బయలుదేరింది. ఒంటిపై దుస్తులు లేకుండా మొరాదాబాద్‌-ఠాకూర్దారా రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఆ బాలికను చూసినవాళ్లు కనీసం సాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. కొంతమంది వీడియోలు తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేశారు.

అయినా, ఆ బాలిక కన్నీళ్లు పెట్టుకుంటూ, దాదాపు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి చేరింది. బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అప్రమత్తమైన అధికారులు నిందితుల్లో ఒకడిని అరెస్టు చేశారు.