భారత సంతతి సిక్కును ఉరితీసిన సింగపూర్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత సంతతి సిక్కును ఉరితీసిన సింగపూర్

July 7, 2022

మాదక ద్రవ్యాల రవాణా కేసులో భారత సంతతి సిక్కు కల్వంత్ సింగ్‌ను సింగపూర్ ప్రభుత్వం గురువారం ఉరి తీసింది. ఈయనతో పాటు సింగపూర్ దేశీయుడైన నోరాషరీ గౌస్‌ను కలిపి ఉరి తీశారు. క్షమాభిక్ష కోసం కల్వంత్ సింగ్ పెట్టుకున్న చివరి అర్జీ కూడా తిరస్కరణకు గురి కావడంతో ప్రభుత్వం శిక్షను అమలు చేసింది. కల్వంత్ సింగ్‌కు మలేషియా పౌరసత్వం ఉంది. దీంతో గడచిన మూడు నెలల్లో భారత సంతతి ప్రజలు ఇద్దరిని సింగపూర్ ఉరి తీసినట్టయింది. ఈ ఏడాది ఏప్రిల్లో ధర్మలింగం అనే వ్యక్తిని కూడా డ్రగ్స్ రవాణా కేసులో ఉరి తీశారు. సింగపూర్‌లో డ్రగ్స్, వాటి రవాణాలపై కఠిన ఆంక్షలు, శిక్షలు ఉంటాయి. కాగా, తాజా ఘటనపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉరి శిక్షను రద్దు చేయాలని ఈ సంస్థ పోరాటం చేస్తోంది. సింగపూర్ చర్యలను ఖండించింది. మరణశిక్ష అన్నది పరిష్కారం కాదని, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా సింగపూర్ వ్యవహరించిందని ఆ సంస్థ డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ ఎమెర్లిన్నే గిల్ విమర్శించారు.