సింగరేణి అప్రమత్తం..కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణి అప్రమత్తం..కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు

March 24, 2020

bgg

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి దేశంలోని అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు ఎవరూ బయటికి వెల్లొద్దంటూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే బయటికి రావాలని, అది కూడా కుటుంబంలోని ఒక్క వ్యక్తి మాత్రమే బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని రంగాల పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. 

కానీ, సింగరేణి కార్మికులు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్న సమయంలోనూ పనిచేస్తున్నారు. సింగరేణి లాక్‌డౌన్‌కు యాజమాన్యం అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. దీంతో బొగ్గు గనులు యథావిధిగా పనిచేస్తున్నాయి. కార్మికులు విధులకు హాజరవుతున్నారు. సింగరేణి యాజమాన్య తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులకు కరోనా సోకితే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నాయి. 

bgg

ఇదిలా ఉంటే సింగరేణి యాజమాన్యం వాదన మరోలా ఉంది. నిరంతర కరెంటు ఉత్పత్తకి అవసరమైన బొగ్గు సరఫరాకు సింగరేణి అత్యవసర సేవలందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని యాజమాన్యం చెబుతోంది. అయితే విధులకు హాజరయ్యే ఉద్యోగుల పట్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. గనుల్లో పని చేసే కార్మికులకు, అధికారులకు క్యూలైన్‌లో వ్యక్తుల మధ్య దూరం ఉండేలా గుర్తుల ఏర్పాటు చేసింది. విధులకు హాజరైన కార్మికులకు అధికారులు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. కార్మికులకు అందుబాటులో సబ్బులు, శానిటైజర్ల ఏర్పాటు చేశారు. మ్యాన్ రైడింగ్, లిఫ్టుల్లో కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యాంటీన్‌లో సోషల్ డిస్టెన్స్ పాటించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కార్మికులు గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకుంటుంది.