సింగరేణి బొగ్గుగనిలో గల్లైంతన కార్మికుడి ఉదంతం విషాదంగా ముగిసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గనిలో పైకప్పు కూలడంతో కనిపించకుండా పోయిన ఓవర్‌మన్ రాపోలు నవీన్ కుమార్ చనిపోయాడు. 28 ఏళ్ల నవీన్ మృతదేహాన్ని ఈ రోజు గుర్తించారు.
1.8 మీటర్ల మందం ఉన్న పైకప్పు కూలి పడడంతో నవీన్ కుమార్ అక్కడే బొగ్గుపొరల కింద చిక్కుకుపోయాడు. మరి కాసేపట్లో పని ముగించుకుని బయటకి రావాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. ఐదుగురు కార్మికులు తప్పించుకున్నారు. కలవేణి సతీశ్ అనే కార్మికుడికి చిన్న గాయాలయ్యాయి. నవీన్ కోసం సహాయక బృందాలు 12 గంటలపాటు గాలించాయి. ఉదయం అతని భౌతికకాయం కనిపించింది. నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలని, కోటి రూపాయల పరిహారంతోపాటు అతని కుటుంబ సభ్యుల్లో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.